హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫామ్‌హౌస్ లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో ఏపీ అలాగే బెంగళూరుకు చెందిన చాలామంది ప్రముఖులు పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నట్లు గుర్తించారు.
సీసీబీ పోలీసుల బృందం దాడి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి తన బర్త్‌డే పార్టీని బెంగళూరు శివారులోని ఓ వ్యాపారికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సీసీబీ యాంటీ నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించింది.
ఈ క్రమంలోనే 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే స్టిక్కర్‌ను గుర్తించారు. అయితే ఈ పార్టీలో తెలుగు హీరో శ్రీకాంత్ పాల్గొన్నారంటూ పలు వెబ్ సైట్స్ లో, న్యూస్ ఛానల్స్ లో ప్రచారం జరుగుతుంది.
తాజాగా ఈ వార్తలపై హీరో శ్రీకాంత్ స్పందించారు. తాను ఎలాంటి పార్టీలో పాల్గొనలేదు, తాను బెంగుళూరుకి వెళ్ళలేదు, తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా, కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు అని శ్రీకాంత్ సినీజోష్ టీమ్ కి తెలిపారు.