ఇండియాలో కనివినీ ఎరుగని.. దేశమే షాకయ్యేలా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఉంటాయని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఊహించని రీతిలో అసెంబ్లీ స్థానాలు గెలిపించి.. సీఎం పీఠంపై కూర్చొబెట్టిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాత్రం అబ్బే అస్సలు ఛాన్సే లేదు.. ఈసారి జగన్ రెడ్డికి ఘోర పరాజయం తప్పదని నేషనల్, లోకల్ మీడియాలకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతిసారీ ఇదే మాట చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే ఒకట్రెండు సార్లు పీకే ఇలా అనేసరికి జగన్‌కు చిర్రెత్తుకొచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తూ.. ఆయన చేసిందేమీ లేదని, ఎలాంటి ప్రయోజనం కూడా లేదన్నట్లు ఐప్యాక్ టీమ్‌తో జరిగిన సమావేశంలో కరివేపాకులాగా తీసిపడేశారు. అయితే.. నన్నే ఇంత మాట అంటావా అని పీకే కన్నెర్రజేసి తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి వైసీపీ, ఏపీ ఎన్నికల గురించి మాట్లాడారు. దీంతో ప్రస్తుతం జగన్ వర్సెస్ పీకే అన్నట్లుగా పరిస్థితులు ఏపీలో నడుస్తున్నాయి.
ఏం జరుగుతోంది..?
ఏపీలో ఎన్నికలు మాత్రమే అయ్యాయి.. ఫలితాలకు ఇంకా చాలానే సమయం ఉంది. ఈ లోపే ఎవరికి తోచినట్లుగా వారు సర్వేలు.. అదిగో గెలిచేశాం.. ఇక అధికారికంగా ఫలితాలు ప్రకటించడమే తరువాయి అని కూటమి.. దేశం మొత్తం షాకయ్యేలా ఫలితాలు ఉంటాయని వైసీపీ చెప్పుకుంటోంది. సరిగ్గా ఈ టైమ్‌లోనే పీకే ఏపీ ఎన్నికలపై మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. జగన్ చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ, అమిత్ షా కూడా గెలుస్తామని చెబుతున్నారని పేర్లు ప్రస్తావించి మరీ చెప్పారు. వీరంతా ఓటమిని ముందుగానే అంగీకరించిన వారేనని తేల్చి పడేశారు పీకే. ఇవన్నీ కాదు.. ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్లు పూర్తయ్యాక అసలు సినిమా మొదలవుతుంది.. అప్పుడు చూడండి అని ఒకింత తనపై జగన్ చేసిన విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు. చూశారుగా.. జగన్‌ను వదలనంటే వదలనన్నట్లుగా పీకే పదే పదే ప్రస్తావిస్తూ రచ్చ.. అంతకుమించి చర్చకు దారితీస్తున్నారు.
అంతం లేదు..!
ఈ ఎన్నికల్లో తప్పకుండా కూటమి గెలుస్తుందని చంద్రబాబు.. గతంలో కంటే ఎక్కువగానే సీట్లు వస్తాయని వైఎస్ జగన్ ఇలా చెబుతున్నారే తప్ప ఈ చర్చకు అంతమే ఉండదని తన మనసులోని మాటను పీకే చెప్పారు. ఇక జాతీయ రాజకీయాలపై మాట్లాడిన పీకే.. దేశ వ్యాప్తంగా బీజేపీకి గతంలో కంటే తగ్గవని స్పష్టం చేశారు. ఎందుకంటే మోదీ, బీజేపీపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి ఉండొచ్చేమో కానీ.. ప్రజలు ఆగ్రహంగా లేరని చెప్పారు. అంటే మరోసారి బీజేపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారనే చెప్పకనే చెప్పేశారన్న మాట. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయో.. ఇప్పుడు కూడా అన్నే రావచ్చు లేదంటే అంతకుమించి రావచ్చని పీకే స్పష్టం చేశారు. కాగా.. ఐప్యాక్ సృష్టికర్త.. హెడ్‌గా ఉన్న ప్రశాంత్ కిశోర్ దీన్ని పూర్తిగా వదిలేసి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు కానీ.. అక్కడ అట్టర్ ప్లాప్ అయ్యి.. ఇప్పుడిలా జోస్యం చెప్పుకుంటున్నారనే విమర్శలు, ఆరోపణలు చాలానే ఉన్నాయి. మరి పీకే మాటలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయో జూన్-04తో తేలిపోనుంది.