ఎన్‌టిఆర్ ఈ మూడక్షరాలకు ఎంత చరిత్ర ఉందో.. ఏ తెలుగువాడిని కదిలించినా గర్వంగా చెబుతాడు. అలాంటి లెజెండ్ పేరు పెట్టుకుని, మనవడిగా ఆయన లెగసీని కంటిన్యూ చేయడం అనేది ఎంత కష్టమో?.. ఎంత భారమో? అది అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఇంత కష్టాన్ని, ఇంత భారాన్ని సునాయాసంగా మోస్తున్నాడు జూనియర్ నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య ఓ ఫంక్షన్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. దేవర నామ సంవత్సరం మొదలైందని అన్నారు. కానీ మొదలైంది దేవర నామ సంవత్సరం కాదు.. ఎన్టీఆర్ నామ సంవత్సరం. ఎందుకూ అంటే.. సినిమా, పాలిటిక్స్.. ఏదైనా కూడా ఈ మధ్య ఎన్టీఆర్ నామస్మరణ లేకుండా జరగడం లేదు. అందుకే ఇది ఎన్టీఆర్ నామ సంవత్సరం. తాతకు తగ్గ మనవడిగా, బాబాయ్ బాలయ్యతో పాటు నందమూరి వారసత్వాన్ని బాధ్యతగా తీసుకుని శిఖరాగ్ర స్థాయికి చేర్చిన ద వన్ అండ్ వన్లీ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన పుట్టినరోజు నేడు (మే 20). తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రౌడ్‌గా చెప్పుకునే ఈ తారకరాముడి బర్త్‌డే స్పెషల్‌గా.. ఆయన స్పెషల్ ఏంటో చూద్దామా..
టాలీవుడ్ ఫ్యూచర్..
అవును టాలీవుడ్ ప్యూచర్‌గా చెప్పుకునే హీరోలలో టాప్ 3 ప్లేస్‌లో ఈ తారకరాముడి పేరుంటుంది. అందుకు కారణం తాత ఇచ్చిన కోటలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ మాత్రం కానే కాదు. డైనమైట్ లాంటి నటన, మాస్ క్రేజ్, డ్యాన్స్.. వీటన్నింటికీ మించిన మానవత్వం, విషయ పరిజ్ఞానం ఆయనని ఆ స్థానంలో నిలబెట్టాయి. తొలి సినిమాతో అందరూ తనని చూసేలా చేసుకున్నా.. ఆది నుంచీ తన జోరు, హోరు చూపించి.. దానిని అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్న తిరుగులేని టాలెంట్ ఈ తారకరాముడి సొంతం. మండు ఏసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా.., మచ్చల పులి ముఖంమీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా.. మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా.. అదే ఈ మాస్ మహాసముద్రం. తారక్ అంటే ఇష్టమని టాలీవుడ్ మాత్రమే కాదు, ఇతర ఇండస్ట్రీలలోని నటీనటులు... తారక్‌తో సినిమా చేయాలని టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలలోని దర్శకులు క్యూ కడుతున్నారంటే.. టాలీవుడ్ ఫ్యూచర్ అనడానికి ఇంతకంటే గొప్పకారణం ఏం చెప్పగలం.
తీరుమారింది.. అనుభవం మార్చింది
ఇండస్ట్రీలోని గొప్పవాళ్లు చెప్పేమాట.. సక్సెస్‌ని తలకు ఎక్కించుకోవద్దు అని. ఈ విషయంలో తారక్ కూడా తడబడ్డాడు. కానీ అనుభవం నేర్పిన పాఠం ఆయనని ఒక ఉన్నత శిఖరంగా మార్చింది. కెరీర్ ప్రారంభంలో వచ్చిన రెండు, మూడు హిట్స్‌తో తారక్ ఎగిసిపడ్డాడు. ఆ హిట్స్‌తో, 2009 ఎన్నికల ప్రచార సమయంలో కూడా దుందుడుకుగా వ్యవహరించాడు. ఆ తర్వాత తనని తాను తెలుసుకున్నాడు. తన దారెంటో, తన కర్తవ్యం ఏంటో గమనించి.. తన తీరు మార్చుకున్నాడు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో అనుభవం ఆయనకు నేర్పింది. తనలోని మెచ్యురిటీ లెవల్స్‌ని దేనికి వాడాలో తారక్ తన అన్న, తండ్రి మరణం తర్వాత మరింతగా తెలుసుకున్నాడు. ప్రస్తుతం సినిమాల సెలక్షన్ పరంగానూ, అదే సమయంలో తనపై వస్తున్న ఒత్తిళ్లు, రాజకీయ విమర్శల పరంగానూ.. తారక్ తన స్థితప్రజ్ఞతని చాటుతున్నాడు. ప్రతి విషయంలోనూ.. ఎప్పుడు సైలెంట్‌గా ఉండాలో, ఎంత వరకు రియాక్ట్ కావాలో అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కూడా కొందరు ఆయనని టార్గెట్ చేశారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే.. ఆయన నిశ్శబ్దమే ఆయన మా మనిషి అని చెప్పుకుని లబ్ధి పొందాలని చూసిన వారి పాలిట శాపమైందని. అలాగే, మరో వర్గాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసిందని.
బాక్సాఫీస్‌పై వేట మొదలైంది..
ఇవన్నీ అటుంచితే.. బాక్సాఫీస్‌పై ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ వేట మొదలు కాబోతోంది. ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ రేంజ్‌లో ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ యంగ్ టైగర్ ఎర్రసముద్రంపై చేసే వేటకి త్వరలోనే అంతా సాక్ష్యం కాబోతున్నారు. దయా నుంచి దేవరగా ఎన్టీఆర్ చేయబోయే దండయాత్ర ఎలా ఉండబోతోందో చెప్పేందుకు ఇంకొన్ని రోజుల్లో థియేటర్లు వేదిక కాబోతున్నాయి. దేవర తర్వాత కూడా బాక్సాఫీస్‌ని వదలనంటూ.. యుద్ధాన్ని తలపిస్తానని ఆల్రెడీ ప్రతిజ్ఞపూనాడీ యంగ్ టైగర్. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఆ తర్వాత నీల్‌తో బాక్సాఫీస్‌కు దమనకాండే. అర్థమైందిగా.. టైగర్ బాక్సాఫీస్ ఎంటపడబోతున్నాడని.. ఇక నరుకుడే.
హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్..
వాస్తవానికి తారక్ ఉన్న పరిస్థితి చూస్తే.. ఏ సైడ్ చూసినా చుట్టూ ముళ్లే. ఏ మాట మాట్లాడినా ప్రాబ్లమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా.. ఏ సైడ్‌ని పట్టించుకోకుండా తన స్టాండ్ అభిమానులే అని చాటి చెబుతూ.. వారి శ్రేయస్సుని అడుగడుగునా కాంక్షిస్తూ, వారి హృదయాలలో మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా గుడి కట్టుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ విజయ విహంగం చేయాలని కోరుతూ సినీజోష్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. హ్యాపీ బర్త్‌డే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (#HappyBirthdayNTR)