ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మాత్రమే అయ్యాయి.. కౌంటింగ్ కాలేదు.. అధికారం ఎవరిదో ఇంకా తేలలేదు.! కానీ అప్పుడే నేతలు గోడ దూకడానికి తయారయ్యారు. ఇప్పుడిదే అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో నడుస్తున్న పెద్ద చర్చ. మరీ ముఖ్యంగా జనసేన తరఫున తిరుపతి నుంచి పోటీచేసిన ఆరణి శ్రీనివాసులు.. సొంత గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలియవచ్చింది. ఆయన వచ్చిందే వైసీపీ నుంచి అంటే.. మళ్లీ అదే పార్టీలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి. అంతేకాదు.. ఇటు జనసేన, టీడీపీ శ్రేణులు సైతం నెట్టింట్లో ఆరణిని తిట్టిపోస్తున్న పరిస్థితి.
తెలిసిపోయిందిగా!
ఫలితాలు రాకముందే ఆరణి.. చిత్తూరు జిల్లా కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారన్న వార్త ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయ్యింది. కూటమిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతోపాటు ఈ మధ్య ఎక్కడ కార్యకర్తల సమావేశమైనా.. నేతలను కలిసినా పెద్దిరెడ్డి ప్రస్తావన రావడంతో జంపింగ్ అనుమానాలకు మరింత క్లారిటీ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీని గానీ.. ముఖ్యంగా పెద్దాయన పెద్దిరెడ్డిని కానీ ఆరణి విమర్శించిన దాఖలాల్లేవ్. అవసరమైతే పెద్దిరెడ్డిని ప్రశంసించి ఆకాశానికెత్తిన సందర్భాలే ఉన్నాయి తప్ప విమర్శించినట్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో కూటమి నేతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడిప్పుడే మొదలైంది కదా.. మున్ముందు ఇంకెంత మంది ఇలాంటి వారు బయటపడతారో చూడాలి మరి.
అప్పుడే పసిగట్టి ఉంటే..!
వాస్తవానికి.. తిరుపతి టికెట్ ఆరణికి ఫిక్స్ అయ్యాక ఎన్నెన్ని గొడవలు జరిగాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. మరీ ముఖ్యంగా.. టీడీపీ, బీజేపీ క్యాడర్ నుంచి అయితే ఎలాంటి సపోర్టు కూడా లేదు. ఎందుకంటే.. శ్రీనివాసులు వైసీపీకి కోవర్టు అని ఎన్నికల తర్వాత ఇదే పార్టీలో ఉంటారనే నమ్మకం లేదని తెలుగు తమ్ముళ్లు, కమలనాథులు అనుమానించారు. వారు అనుకున్నట్లు ఇప్పుడు జరుగుతుండటంతో ఏదో తేడా కొడుతున్నట్లే ఉంది. చిత్తూరు ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున 2019లో గెలిచిన ఆరణి.. హైకమాండ్ టికెట్ నిరాకరించడంతో జనసేనలో చేరడం, తిరుపతి టికెట్ తెచ్చుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఇలా పార్టీలోకి వెళ్లమని చెప్పింది కూడా పెద్దిరెడ్డేనన్నది కాస్త లోతుగా వెళ్లి ఆలోచిస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నది జనసేన కార్యకర్తల నుంచి వస్తున్న మాటలు. గెలిచినా.. ఓడినా పక్కాగా ఎప్పుడైనా వైసీపీలో చేరే వ్యక్తి ఇతను అని సోషల్ మీడియా వేదికగా జనసేన, తెలుగుదేశం శ్రేణులు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇందులో నిజానిజాలెంత అనేది తెలియాల్సి ఉంది.