జూన్ 4న ఏపీలో ఏం జరుగునో..
జూన్ 4.. ఇప్పుడీ తేదీ అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బెంబేెత్తిపోతున్నారు. ఆ రోజు ఏపీ ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఏం జరుగుతుందో..? ఇంకెన్ని గొడవలు జరుగుతాయో..? పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి లాంటి ఘటనలు తమ నియోజకవర్గంలో.. ఊర్లో ఎక్కడ జరుగుతాయో? ఎక్కడ ఊర్లు వదిలి పారిపోవాల్సి వస్తుందో..? ఎటు నుంచి ఎవరు దాడులకు తెగ పడతారో అని భయంతో బతుకుతున్నారు. దీనికి తోడు ఏపీని ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ చేసింది.
అప్పుడే ఐపోలేదు!!
ఒక్క ఫలితాల రోజే కాదు.. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఇందుకు అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన 15 రోజులు గొడవలు తప్పవన్న మాట. వాస్తవానికి ఏపీలో పోలింగ్ వేళ జరిగిన అల్లరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పోలింగ్ మొదలుకుని ఐపోయిన 48 గంటల పాటు ఎంతటి హింస జరిగిందో మనం టీవీ, సోషల్ మీడియాలో చూశాం. రేపొద్దున ఇంతకు మించి జరగడానికి వీల్లేదని.. ముందుగానే అడ్డుకట్ట వేయాలని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.
నెవర్ బిఫోర్..!
వాస్తవానికి పోలింగ్ రోజు నుంచి రెండ్రోజుల పాటు ఏపీ రావణకాష్టంలా మారిపోయింది. ఇందులో ఏ పార్టీని విమర్శించడానికి లేదు. ఫ్యాక్షన్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా టీడీపీ, వైసీపీ వేసిన వీరంగం ప్రతీ ఒక్కరినీ వణికించిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనగా.. చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. కానీ.. ఏకంగా నాటు బాంబులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయి వరకూ వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఈ గొడవతో ఏపీ సిఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల కమిషన్ పిలిచి క్లాస్ తీసుకొని.. నివేదిక ఇచ్చే పరిస్థితి వచ్చింది. చూశారుగా.. బహుశా ఇలాంటి గొడవలు ఇప్పటి వరకూ ఈ జనరేషన్ చూసి ఉండదేమో..!!. ఫలితాల రోజున పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.