ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగానే ముగిశాయి. ఇక ఎవరి గెలుపు ధీమాలో వారు ఉన్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కూటమి తరఫున నిలబడిన మహామహులను వైసీపీ తరపున నిలబడిన ఆడపడుచులు ఢీ కొన్నారు. ఇందులో నాలుగు అసెంబ్లీ స్థానాలు ముఖ్యమైనవి.. అంతకు మించి ప్రాధాన్యత కలిగి ఉండేవి. ఇక ఏపీలో కీలక నియోజకవర్గం అయిన కుప్పం కూడా ఉన్నది. ఇందులో.. 1. మంగళగిరి, 2. కుప్పం , 3. పిఠాపురం, 4. హిందూపురం. రండి ఇక్కడినుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు..? ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది..? అనే విషయాలు తెలుసుకుందాం.
మంగళగిరి.. మురుగుడు లావణ్య!
మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేశారు. ఎంత తక్కువ అయినప్పటికీ వెయ్యి ఓట్ల మెజారిటీతో అయినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఎలాగంటే.. గత ఎన్నికల్లో లోకేశ్‌పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడటం ఎన్నికల ముందు మళ్ళీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం అధికార పార్టీకి ఒక ప్లస్ పాయింట్. మరోవైపు చేనేత సామాజిక వర్గానికి చెందిన, సీనియర్ నాయకుడు గంజి చిరంజీవి కూడా వైసీపీలో ఉండటం కలిసొచ్చే అంశం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కుటుంబీకురాలే కావడంతో ఈమె రాజకీయాలకు కొత్తేమీ కాదు. ఎంఏ ఇంగ్లిష్ చదువుకున్న లావణ్య.. మంగళగిరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు ఉన్న పద్మశాలి సామాజికవర్గానికి చెందినది. అందుకే వైసీపీ వ్యూహాత్మకంగా ఆఖరి నిమిషంలో గంజి, ఆళ్ళను పక్కనెట్టు మరీ మురుగుడు లావణ్యను ఇక్కడ పోటీలో నిలిపింది. పైగా లావణ్యకు ఇవే తొలి ఎన్నికలు. అందుకే ఒకవైపు సామాజిక వర్గం, ఇంకోవైపు సీనియర్లు, మరోవైపు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం ప్లస్ పాయింట్స్.
దీపిక దుమ్ము లేపుతారా..?
దీపిక.. టీడీపీ కంచుకోట అయిన హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపై వైసీపీ తరపున పోటీ చేస్తున్న మహిళ. ఎంసీఏ చదువుకున్న 40 ఏళ్ల దీపిక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ వైసీపీ 2014, 2019 2024 ఎన్నికలను ఎదుర్కోగా కంచుకోటను కూల్చి.. పసుపు జెండా స్థానంలో బులుగు జెండా పాతాలని కంకణం కట్టుకుంది. అందుకే.. బాలకృష్ణపై ప్రతిసారీ అభ్యర్థులను మార్చుతున్న వైసీపీ ఈసారి కూడా కొత్త అభ్యర్థినే బరిలో నిలిపింది. హిందూపురం వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి భార్య దీపిక. ఈమెది కురుబ సామాజికవర్గం కాగా.. భర్త రెడ్డి సామాజిక వర్గం. ఈ నిర్ణయంతో ఈ రెండు కులాలకు దగ్గర కావచ్చన్న ప్లాన్‌తో దీపికకు టికెట్ ఇచ్చారని.. పైగా మహిళ అనే సెటిమెంట్ పండుతుందని వైసీపీ అభిప్రాయపడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. పైగా హిందూపురం ఎంపీగా మహిళనే నిలబెట్టి చరిత్రలో నిలపాలని అధికార పార్టీ భావిస్తోంది. ఈ ఇద్దరికీ టికెట్ రావడంలో మంత్రి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. కుప్పం నియోజకవర్గంను ఎంత సీరియస్ గా తీసుకున్నారో.. హిందూపురంను కూడా అంతే సీరియస్ గా తీసుకున్నారు.
వంగా గీత ఓడిస్తారా..?
వంగా గీత.. గురుంచి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పిఠాపురం నుంచి పోటీ చేసిన మహిళ. గత ఎన్నికలలో కాకినాడ ఎంపీగా గెలిచిన ఈమెను వైసీపీ బరిలోకి దింపింది. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గీత.. 2000లో ఆ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఇదే పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి కాకినాడ ఎంపీ టికెట్ తెచ్చుకున్న గీత ఈ ఎన్నికలలో విజయం సాధించారు. ఈసారి కూడా కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాగా ఉన్నారు. పైగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పైగా గీత లోకల్ అని.. మహిళ అనే సెంటిమెంట్.. రాజకీయ అనుభవం కలిసి వస్తుందని వైసీపీ భావించి బరిలోకి దింపింది.
కుప్పం కోట బద్దలవుతుందా..!!
కుప్పం.. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట. ఎందరో ఈ కోటను కూల్చాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఎవరివల్లా కాలేదు. ఈసారి మాత్రం కూసాలు కదిలిపోవడమే కాదు.. బద్దలు కొట్టే తీరుతామని పీసు పీసులు చేస్తామని వైసీపీ చెబుతోంది. అందుకే ఇక్కడి నుంచి యువనేత భరత్ ను పోటీలోకి దింపింది వైసీపీ. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి తనయుడే భరత్.. బాబుపై చంద్రమౌళి రెండు దఫాలు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తా అని పదే.. పదే చెబుతున్నారు. పైగా కుప్పం నియోజకవర్గంను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కంటే ఎక్కువగా స్పెషల్ ఫోకస్ పెట్టి.. బాబును ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే.. నియోజకవర్గ అభివృద్ధిని చేయడమే గాక.. ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా కుప్పం నుంచే మొదలు పెట్టడం జరిగింది. పైగా ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టడం జరిగింది. గత ఎన్నికల్లో ఒకటి రెండు రౌండ్లలో వెనుకబడిన బాబు.. ఈసారి ఊహించని రీతిలో ఓడిపోతారని.. ఒక్క మునిసిపాలిటీ పైనే చంద్రబాబుకు ఆశలు ఉన్నాయని.. మిగిలిన అన్ని ప్రాంతాలు మార్పు కోరుకుంటున్నాయని వైసీపీ చెబుతోంది. దీనికి తోడు.. భరత్ ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా వైఎస్ జగన్ మాటిచ్చారు.
ఇప్పుడు చెప్పండి.. మొత్తం చూశారుగా ఈ నలుగురిలో ఏ ఒక్కరు గెలిచినా అది చరిత్రే.. హిస్టరీ రిపీట్ అంతే మరి. ఈ నలుగురిలో గెలిచి నిలిచేదెవరు..? ఇంటికి పరిమితం అయ్యేదెవరు..? అనేది జూన్ నాలుగో తారీఖున తేలిపోనుంది. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..!!