విజయశాంతి.. అలియాస్ రాములమ్మ అటు తిరిగి ఇటు తిరిగి సొంత గూటికి చేరిపోతున్నారా..? కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక పోతున్నారా..? జాతీయ పార్టీ అయినప్పటికీ ప్రాంతీయ పార్టీలే బెస్ట్ అని భావిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలు.. రాములక్క చేసిన ట్వీట్ ను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజం అనిపిస్తోంది. ఇంతకీ విజయశాంతి చేసిన ట్వీట్ ఏంటి..? నెట్టింట, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏమిటీ అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!
ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి..?
బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా విజయశాంతి రియాక్ట్ అయ్యారు. తెలంగాణల బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం... ఎప్పటికీ..ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గార్ల నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించు కోవాల్సిన తప్పని అవసరం... ఎన్నడైనా.. వాస్తవం. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం. హర హర మహాదేవ్.. జై తెలంగాణ.. విజయశాంతి! అని రాములమ్మ ట్వీట్ చేశారు.
చర్చకు దారి తీసిన ట్వీట్!!
విజయశాంతి చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో పెద్ద చర్చకే దారి తీసింది. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ బీఆర్ఎస్ పార్టీని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడటం గమనార్హం. వాస్తవానికి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అదేమీ జరగలేదు. పోనీ కార్పొరేషన్ పదవి కనీసం దక్కుతుందని అభిమానులు అనుకున్నారు కానీ.. అబ్బే ఆ ఊసే లేదు. ఇవన్నీ చిన్న చిన్న పదవులు పెద్ద పదవే దక్కుతుందని అనుకున్నా రాజ్యసభ ఎంపీ కూడా దక్కలేదు. చివరిగా పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లేదా వరంగల్ నుంచి పోటీలో ఉంటుందని టాక్ నడిచింది. వీటిలో ఒక్కటీ జరగక పోవడంతో తీవ్ర నిరాశ.. నిస్పృహకు లోనైన రాములమ్మ ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇందుకు తాజాగా చేసిన ట్వీట్ కారణమని చెప్పకనే చెప్పేశారు రాములమ్మ. పైగా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితురాలిగా పేరున్ను విజయశాంతి.. కాంగ్రెస్ పార్టీ వద్దనుకొని.. కారు ఎక్కినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.