ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నెన్ని చిత్ర విచిత్రాలు.. అంతకు మించి గొడవలు కూడా చూశాం కదా..! ఇవన్నీ ఒక ఎత్తయితే ఎన్నికలు పూర్తయ్యాక మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికి వస్తున్నాయ్. ప్రజలు ఎవరికి.. ఏ గుర్తుకు ఓటేసారో తెలియట్లేదు కానీ.. ఎవరి గెలుపు ధీమాలో వారున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేకు సంబదించిన విషయం బయటికి రావడం ఆ నియోజక వర్గంలోనే కాదు ఇప్పుడిది అటు రాష్ట్రంలో.. ఇటు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
పాపం.. ప్రతాప్..!
నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఐతే ఇది హై కమాండ్ మాత్రమే అనుకుంటోంది.. కానీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మాత్రం ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదన్నది ఈ ఒక ఘటనతో అర్థమవుతుంది. కావలి ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీకి ఓటు వేసారన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. లోక్ సభ ఎన్డీఏ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటేసినట్టు విస్తృతంగా చర్చ నడుస్తోంది. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావిడిగా సైకిల్ గుర్తుపై ఓటేశారంటూ వైసీపీ శ్రేణుల్లోనూ చర్చ జరుగుతోంది. సైకిల్ గుర్తుకు ఓటేసి.. మళ్లీ మార్చమని పోలింగ్ సిబ్బందిని అడిగారని అధికార పార్టీలో చర్చించుకుంటున్న పరిస్థితి.
విమర్శలు కాదు.. ఇటు చూడండి!
చూశారుగా.. ఇన్ని రోజులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన గుర్తుకు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు తన సొంత నియోజక వర్గంలో ఓటేసుకోలేని పరిస్థితి అంటూ ఇన్ని రోజులు విమర్శలు, తిట్టిపోసిన పరిస్థితి. వాళ్ళు ఎక్కడ ఓటు ఉంటే అక్కడ వినియోగించుకున్నారు. కూటమిలో భాగంగా ఆయా సీటు నుంచి పోటీ చేసిన అభ్యర్థికి ఓటు వేశారు. ఇది అలా ఉంచితే.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి చేసిందేంటి..? సొంత నియోజవర్గమైన కావలిలో సొంత పార్టీ, గుర్తు ఫ్యాన్ పైన వేయలేని పరిస్థితి. ఇదీ సంగతి.. చూశారుగా.. అందుకే ఒకరిని కరివేపాకులా తీసి పడేసే ముందు.. మన తప్పులు కూడా తెలుసుకుంటే మంచిదేమో మరి.