గత మూడు నెలలుగా సరైన సినిమా లేక ప్రేక్షకులు ఎంత బోర్ ఫీలవుతున్నారో థియేటర్స్ యాజమాన్యాలు థియేటర్స్ నడపలేక అంతే సతమతమవుతున్నారు. చిన్న సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. దానితో సినిమాలు విడుదలవుతున్నా థియేటర్స్ దగ్గర జనాలు కనిపించడం లేదు. మల్టిప్లెక్స్ ఎలా ఉన్నా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి మరింతగా ఈ డల్ సీజన్ దెబ్బేసింది.
ఎలక్షన్స్ మూమెంట్ అంటూ దర్శకనిర్మాతలు సినిమాలు విడుదల చేసేందుకు వెనక్కి తగ్గారు. దానితో బాక్సాఫీసు బోసిపోయింది. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ లేక విలవిలలాడుతున్నాయి. అందుకే తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమాల విడుదల లేక థియేటర్లు నడపటం భారం కావడంతో తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుండి పది రోజులు పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడనున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ ముగిసినా సినిమాలు మే 31 వరకు విడుదలకు రెడీగా లేకపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు ఈ నిర్ణయానికి రాగా.. ఇది చూసిన వారు అయ్యో థియేటర్స్ కి ఎంత కష్టం వచ్చి పడింది అంటూ కామెంట్ చేస్తున్నారు.