ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. గత నాలుగైదు నెలలుగా నడిచిన ఎన్నికల హడావుడి అంతా ఐపోయింది. పోలింగ్ రోజున అంతా ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్న చోట.. ఎవరూ ఊహించని నియోజకవర్గాలు రణరంగంగా మారిపోయాయి. రాయలసీమ అంటే ఫాక్షన్ అని ఒక్కప్పుడు ఎలా అనే రీతిలో గొడవలు జరిగాయి. పోనీ ఎన్నికల రోజు మామూలే అనుకుంటే అది కాస్త మరుసటి రోజు వరకూ కంటిన్యూ అవుతూనే ఉండటం గమనార్హం. అంటే ఎన్నికలు మాత్రమే ముగిశాయి కానీ హింస మాత్రం ఇప్పట్లో ఆగేలా లేదు. బహుశా.. జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వచ్చే వరకు.. వచ్చాక ఇంతకు మించి జరిగినా జరగొచ్చు.
ఇదీ అసలు సంగతి..!
పులివర్తి నాని.. ఒకప్పటి టీడీపీ కంచుకోట అయిన చంద్రగిరి నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ మామూలుగానే చిన్నపాటి సర్పంచ్ ఎన్నికలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ఐతే ఎట్టా ఉంటది అనేది మాటల్లో చెప్పలేం. సినిమాల్లో చూడని.. మునుపెన్నడూ లేని విధంగా గొడవలు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి ఈవీఎం మిషన్లు పెట్టిన స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా గొడవలు జరిగాయి అంటే పరిస్థితి ఇక ఉంది అర్థం చేసుకోవచ్చు.
పల్నాడు.. తాడిపత్రిలో ఇలా..!!
పల్నాడు అంటే ఒక్కప్పుడు ఫ్యాక్షన్ గొడవలకు మారుపేరు.. అలాంటిది ఈ ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి, మాచర్ల, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల్లో ఎన్నికల మొదలుకొని ఇప్పటి వరకూ ఎంతటి గొడవలు జరుగుతున్నాయి అనేది టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. బాబోయ్ ఆ పెట్రోల్ బాంబులు, రాళ్ళ దాడి ఏ రేంజిలో జరిగాయ్.. జరుగుతున్నాయో సోషల్ మీడియాలో చూస్తే అర్థం అవుతుంది. పల్నాడు ఆస్పత్రి మొత్తం గొడవల్లో గాయపడిన జనాలతోనే నిండి పోయింది అంటే.. ఇక ప్రయివేటు ఆస్పత్రులు గురుంచి అయితే చెప్పక్కర్లేదు. ఇక నరసారావుపేట ఎమ్మెల్యే గోపీనాథ్ రెడ్డి ఆస్పత్రిలో ఐతే లెక్కే లేదు. ఇక తాడిపత్రిలో ఐతే పెద్దారెడ్డి వర్సెస్ జేసి ప్రభాకర్ రెడ్డి మధ్య ఇప్పట్లో గొడవలు ఆగట్లేదు. పోలింగ్ రోజున ఒకరినొకరు ఎదుట పడినప్పుడు మొదలైన గొడవ ఒకరి ఇంటిపై మరొకరు దాడి చేస్తున్న పరిస్థితి.
నిద్ర మత్తు దిగలేదా. !
ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల కమిషన్ పై మాత్రం పెద్ద ఎత్తునే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకూ ఇంత జరుగుతుంటే ఎన్నికల కమీషన్ నిద్రపోతోందా..? ఎన్నికలలో ఇంత హింస జరిగింది.. తెల్లారి కూడా మళ్ళీ మొదలయింది ఎందుకు ఈసీ నిద్ర మత్తులో ఉందో అర్థం కాని విషయం. అసలు ఎందుకు ఆయా జిల్లాల, ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులపై మరీ ముఖ్యంగా డీజీపీ, జిల్లా ఎస్పీలపై చర్యలు తీసుకోలేదో ఎవరికీ అర్థం కావట్లేదు. పైగా నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పోలుబొయిన అనిల్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి ఫోన్ చేసినా ఎస్పీ, కలెక్టర్ స్పందించని పరిస్థితి.. వచ్చిందంటే అధికారులు, ఎన్నికల కమిషనర్ టీడీపీకి అమ్ముడుపోయారని ఆరోపణలు వైసీపీ నుంచి గట్టిగానే వస్తున్నాయ్. ఇక సోషల్ మీడియాలో ఐతే ఒక్కటే తిట్లు.. ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఇక ఉంటుందో.. ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.