జనసేనను నిలువెత్తునా ముంచారా..?
జనసేన కీలక నేత, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక హడావుడి చేస్తూనే ఉంటారు. అలాంటిది ఎన్నికల పోలింగ్ తర్వాత చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో.. ఇటు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటంటే.. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...! అని నాగబాబు ట్వీట్ చేశారు. అసలు ఈ ట్వీట్ అర్థమేంటి..? ఎవరిని ఉద్దేశించి చేశారు..? ఎన్నికలు జరిగిన మరుసటి రోజే ఎందుకు..? అనేది తెలియట్లేదు.
ఏం జరుగుతోంది..?
పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ నేత సత్యనారాయణ వర్మకు దక్కాల్సిన టికెట్.. కూటమిలో భాగంగా సేనానికి దక్కింది. కుదరదు వర్మకు ఇవ్వాల్సిందే అని ఎంత పట్టుబట్టారో.. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఖరికి వర్మ.. పవన్ ఒక్కటై ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఇక అవన్నీ అటుంచితే.. ఇక నాగబాబు ట్వీట్ సంగతికి వచ్చేద్దాం. ఐతే వర్మ ఆపోజిట్ అయ్యి మోసం చేశారా..? ఆఖరి నిమిషంలో పిఠాపురంలో ఏమైనా జరిగిందా అనేది ఎవరికీ అర్థం కావట్లేదు.
అల్లు అర్జున్ గురించేనా..?
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే పవన్ గెలుపు కోసం ఒక ట్వీట్ చేసి.. మిత్రుడు, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కోసం నంద్యాలకు వెళ్లొచ్చాడు. అబ్బో ఆ జనం, ఆ ఈలలు, కేరింతలు.. హడావుడి మామూలుగా లేదు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. దీంతో ఏపీలో పుష్ప పేరు మారుమోగింది. మరోవైపు.. నంద్యాలలో అప్పటికే ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఒకవైపు.. మరోవైపు అల్లు అర్జున్ రాకతో నంద్యాల ఒక్కసారిగా హీటెక్కింది. అంతేకాదు ఆఖరికి బాబు నోట ఐకాన్ స్టార్ మాట కూడా వచ్చింది. విమర్శలు కూడా బాబు గట్టిగానే గుప్పించారు.. మరోవైపు పోలీస్ కేసు కూడా నమోదయ్యింది. ఐతే సేనానిని కాదని అటు ఫ్రెండ్ కోసం పోయాడని ఇలా నాగబాబు ట్వీట్ చేశారా అనేది కూడా చర్చ నడుస్తోంది.
నీతులు కాదు..!!
ఇప్పుడు ఎన్నికలైపోయాయి కాబట్టి సరిపోయింది.. లేదంటే నాగబాబు ట్వీట్‌కు పరిస్థితి ఎలా ఉండేది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ ట్వీట్ పై కామెంట్స్ చూస్తే అబ్బో మామూలుగా లేవు. అంతా సరే.. మరి ఒకప్పటి పత్యర్ధి చంద్రబాబు కోసం పని చేసిన చేస్తున్న మీ వాడు అదే పవన్ కళ్యాణ్ ఏంటో మరి.. అది కూడా సెలవీయండి ..! సూక్తులు చెప్పడం కాదు పాటిస్తే బాగుంటుంది అని కౌంటర్లు వస్తున్నాయ్. కొన్ని విషయాలు లైట్ తీసుకుంటే ఒంటికి ఇంటికి చాలా మంచిదంటారు కదా.. ఈ విషయం గుర్తు చేసుకుంటే మంచిది బాబు..!!