ఏపీలో ఓట్లకు జనాలు పోటెత్తారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయాలని ఏపీకి వచ్చి వాలిపోయారు. ఉదయం 6 గంటల నుంచే పండగ మొదలు కానుంది. తమ అభిమాన నాయకుడిని, నచ్చిన పార్టీని గెలిపించుకునేందుకు ఓటు వేయడానికి ఉత్సాహం కనబరిచారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది. ఇక క్యూ లైన్లు ఐతే 6 గంటలకే మొదలు కానున్నాయి. మరోవైపు పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు ఎవరెక్కడ ఓట్లు వేస్తున్నారు..? ఇక సినీ, రాజకీయ ప్రముఖులు ఎక్కడ.. ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు అని తెలుసుకోవడానికి జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
జగన్ ఇలా..!
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పులివెందుల బాకరాపురంలోని పోలింగ్ కేంద్రంలో జగన్, ఆయన సతీమణి భారతి రెడ్డి ఓటు వేయనున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికిగాను.. ఆదివారం సాయంత్రం 4 గంటలకే తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ముచ్చటించారు.
చంద్రబాబు.. పవన్ ఇద్దరూ ఇలా..!!
చంద్రబాబు కుప్పం నుంచి బరిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కు మాత్రం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోనే ఉంది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉండవల్లిలోని పోలింగ్ బూత్‌లో చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణిలు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉండగా మంగళగిరిలో ఓటు వేయబోతున్నారు. ఆదివారమే మంగళగిరికి విచ్చేసిన సేనాని.. రాత్రి ఇక్కడే బస చేశారు. కాగా పోటీ చేస్తున్న సొంత నియోజక వర్గాల్లో ఓటు వేసుకోలేకపోవడం గమనార్హం. దీంతోనే ఇద్దరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.
సీనియర్లు ఇలా..!
జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమౌళి, రమారాజమౌళి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో అక్కినేని ఫ్యామిలీ నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, అమల ఓటు హక్కు వినియోగించుకుంటారు.
జూనియర్లు ఇలా..!
ఓబుల్‌రెడ్డి స్కూలులో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి దంపతులు.. బీఎస్ఎన్ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్ కుటుంబ సభ్యులంతా ఓటు వేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలులో మహేశ్‌బాబు, నమ్రత తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇదే పబ్లిక్ స్కూలులో మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ,శ్రీకాంత్ , జీవిత రాజశేఖర్ కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.