దేశ, విదేశాలు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఏపీలో వాలిపోతున్నారు. ఆంధ్రాకు రావాల్సిందే.. ఓటు వేయాల్సిందే అంటూ తరలివచ్చేస్తున్నారు. ఇంకా జనాలు స్వగ్రామానికి పయనం అవుతున్నారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే దారులన్నీ ఏపీ వైపే ఉన్నాయ్. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బస్సులు, రైళ్లు, కార్లు, బైకులపై కూడా వస్తున్నారు. దీంతో భాగ్యనగరం బోసిపోయింది. ఇక ఇంటికి రాగానే మన ఓటు ఎక్కడ..? పోలింగ్ బూత్ సంగతేంటి..? ఏ పార్టీ ఎంత ఇచ్చింది..? ఎవరికి ఓటు వేయాలి అని ఇంటిల్లిపాది చర్చించుకుంటున్న పరిస్థితి.
ఈసారి గట్టిగానే..?
2019 ఎన్నికల్లో 79.74 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఈసారి వరుస సెలవులు, ఏ పార్టీలకు ఆ పార్టీలు రవాణా సదుపాయం కల్పించడం.. ఇక మునుపటితో పోలిస్తే ఓటుకు డబ్బులు కూడా గట్టిగా ఇవ్వడం.. వీటి అన్నిటికీ మించి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటుపై వందకు వెయ్యి శాతం చైతన్యం కల్పించడం ఈసారి బాగా కలిసొస్తుంది అనేది నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
ఎంత పెరగచ్చు..?
ఏపీలో వాలిపోతున్న జనాలను బట్టి చూస్తే ఈసారి కచ్చితంగా గతం కంటే తక్కువలో తక్కువ 15 శాతం పెరుగుతుందని ఎన్నికల కమిషన్ కూడా అంచనా వేస్తోంది. అంటే 79.74 నుంచి 15 శాతం అనగా.. 95 శాతం పెరుగుతుంది అన్న మాట. అంతకు మించి పెరిగినా ఆశ్చర్యపొనక్కర్లేదు ఏమో. సో.. ఈసారి మీట నొక్కితే ఏపీ మోత మోగుతుంది అన్నమాట.
పార్టీల్లో భయం..!
ఓటింగ్ శాతం పెరిగితే ఓటు ఎటు పడుతుంది అనేది అంచనా వేయలేం.. పైగా ఈసారి చదువుకున్నవాళ్ళు ఎటు ఓటు వేస్తారు అన్నది తెలియని పరిస్థితి. ఐతే ఓటింగ్ పెరిగితే మన పార్టీ పరిస్థితి ఏంటన్నది వైసీపీ.. కూటమి పార్టీల్లో భయం మొదలైంది. కాదు గీదు అంటే ఈ వర్గం గెలుపు ఓటములు నిర్ణయించినా అతిశయోక్తి కాదు. ఇక ఏం జరుగుతుంది.. ఏం అన్నది సోమవారం సాయంత్రానికి తేలిపోనుంది.