ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. మైకులు, మీడియా గొట్టాలు మూగబోవడంతో ఇక సోషల్ మీడియానే పరమావధిగా నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఆరోపణలు, కౌంటర్లు అంటారా యథావిధిగా నడుస్తూనే ఉన్నాయ్. ఇక పార్టీల కార్యకర్తలు, వీరాభిమానులు, నేతలు అంటారా నెట్టింట్లోనే ప్రచారం చేసేస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన సీనియర్ నేత కొణిదెల నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇది చూశాక మెగాభిమానులు, జనసేన శ్రేణులు ఒకింత పులకించిపోతున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ కథేంటో చూసేద్దాం వచ్చేయండి మరి.
అలసితి.. సొలసితి!
ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతలా కష్టపడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. గ్యాప్ లేకుండా ఎన్నికల ప్రచారం చేయడంతో వడదెబ్బ, జ్వరం, అనారోగ్యం పాలవ్వడం ఆఖరికి నాలుగైదు రోజులు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వచ్చింది. కూటమి గెలిచి తీరాల్సిందేనని అహర్నిశలు కష్టపడ్డారు. ఆయన శ్రమ ఏ మాత్రం ఫలిస్తుందన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తమ్ముడు పవన్‌కు సోదరుడు నాగబాబు సపర్యలు చేస్తున్న ఫొటోను రిలీజ్ చేశారు. నిజంగా తమ్ముడిపై అన్నకు ఎంత ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఉందనేది తెలిపేదే ఈ ట్వీట్.. సింగిల్ ఫొటో!
విజయీభవ..!
నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడ ఎందుకు నిలబడతావ్ అని అడిగితే.. చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని...!. నీతో నడవని వాళ్ల కోసం కూడ ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే.. వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని..!. అప్పట్నుంచి అడగటం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను.. సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది.. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది.. విజయీభవ..! అని నాగబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను వేలాది మంది చూడగా.. వందల సంఖ్యలో కామెంట్లవర్షం కురిపించారు.