ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఇవాళ పార్టీలన్నీ ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాయి. ఇన్నాళ్లు హోరెత్తిన మైకులు.. నేతల మధ్య మాటల తూటాలు.. కౌంటర్లు, విమర్శలు.. ప్రతి విమర్శలు అన్నీ మరికొన్ని గంటల్లో బంద్ కానున్నాయ్..! మైక్ మూగబోనుంది.. నేతల నోటికి తాళాలు పడనున్నాయ్!. ఇక మిగిలింది కేవలం 48 గంటలు మాత్రమే అంటే.. ఇవాళ, రేపు మాత్రమే. ఈ గంటలను ఏ పార్టీ సద్వినియోగం చేసుకుంటుందో.. ఆ పార్టీదే దాదాపు గెలుపన్నది జగమెరిగిన సత్యమే. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా.. పార్టీల అంచనాలన్నీ తలకిందులు కావొచ్చు.
ఓటురు ఎటు..?
ఇప్పుడు ఉన్న ఈ కాస్త సమయాన్ని ఏ పార్టీ అయితే సరిగ్గా వాడుకుంటుందో.. ఆ పార్టీదే ఐదేళ్ల సెటిల్మెంట్..! అలా ఉంటుంది పరిస్థితి. అంటే శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రచారానికి అనుమతి ఉండదు. కనీసం బల్క్ మెసేజ్‌లు, ఐవీఆర్‌ఎస్ కాల్స్, ఐవీఆర్‌ఎస్ సర్వేలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రకటనలు చేసినా సరే కఠిన చర్యలు ఉంటాయి. అయితే.. ప్రింట్ మీడియాలో మాత్రమే ప్రకటనలకు మాత్రం అనుమతి ఉంటుంది. అటు మైక్ మూగబోగానే.. అప్పట్నుంచి డబ్బులు, గిఫ్టులు.. వగైరా.. ఇవ్వడానికి పార్టీలు షురూ చేస్తేస్తాయ్. డబ్బులు అన్ని పార్టీలు ఇస్తాయ్.. తీసుకోవచ్చు అదేం నేరమేమీ కాదు.. డిసైడ్ చేయాల్సింది.. ఎవర్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్నది మాత్రం ఓటరు వంతు. సో.. మద్యం, డబ్బులు, ప్రలోభాలకు లొంగకుండా మనస్సాక్షిగా ఓటేయండి.
ఆఖరి నిమిషమే!
ఈ క్లైమాక్స్‌లో ఎవరు సరిగ్గా సీన్ పండిస్తారో వారిదే సినిమా. ఇన్నాళ్లూ చేసింది వేరు.. ఇప్పుడు చేసేది వేరు. బిజినెస్‌మెన్ సినిమా గుర్తుంది కదా.. హెలికాఫ్టర్లలో డబ్బులు తీసుకెళ్లి ఓటర్లకు పంచడం ఇలాంటివన్నీ రెండు మూడ్రోజులుగా ఏపీలో ఎక్కడ చూసినా నడుస్తూనే ఉన్నాయ్. ఓటర్లూ తీసుకుంటూనే ఉన్నారు.. ఎవరొచ్చినా కాదనకుండా తప్పకుండా ఓటేస్తామని చెబుతున్నారు.. ఆఖరి నిమిషంలో ఎవరికి ఓటేస్తారు..? అనేదే ఎవరికీ అంతు చిక్కని విషయం. ఓటరు దెబ్బకు ఫ్యాన్ సునామీ సృష్టిస్తుందో.. లేకుంటే కూటమి దెబ్బ వైసీపీ అబ్బా అంటుందో చూడాలి మరి.