అటు బాబు.. ఇటు అల్లు.. గెలిచేదెవరు?
టీడీపీ అధినేత, విజనరీ లీడర్ నారా చంద్రబాబు.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ నంద్యాలలోనే ఉన్నారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇవాళ ఉదయమే పిఠాపురంలో వైఎస్ జగన్ వర్సెస్ రామ్ చరణ్ అని చెప్పుకున్నాం కదా..! ఇప్పుడేమో విజనరీ వర్సెస్ ఐకాన్ అన్నమాట. నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తున్న శిల్పా రవికిషోర్ రెడ్డిని గెలిపించడానికి అల్లు వారబ్బాయ్ విచ్చేశారు. ఆయన రాకతో నియోజకవర్గం జనసంద్రమైంది. ఇసుకేస్తే రాలనంత జనం.. ఒక్కటే ఈలలు, కేకలతో హోరెత్తాయి. ఇక చంద్రబాబు సభలోనూ జనాలు పర్లేదనిపించారు.
గెలిపించండి..!
శిల్పా రవి-అల్లు అర్జున్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కచ్చితంగా ఐకాన్ స్టార్ నంద్యాల రావాల్సిందే.. ప్రచారం చేయాల్సిందే. 2019 ఎన్నికల్లోనూ ఇదే సీన్. ఇప్పుడూ అదీ రిపీట్ అయ్యింది. తొలుత శిల్పా ఇంటికెళ్లిన హీరో.. కుటుంబ సభ్యులతో చర్చించారు. అనంతరం ఇంటి నుంచి బయటికొచ్చి అభిమానులు, కార్యకర్తలు, వైసీపీ డై హార్డ్ ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు. అల్లు అర్జున్ కోసం భారీగానే ప్లానింగ్ చేసింది శిల్పా ఫ్యామిలీ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రాకముందు తాను, రవి వారానికోసారి కలిసేవాళ్లమని.. ఐదేళ్లుగా ఆర్నెళ్లకోసారి కలుస్తున్నామన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న మనిషికి అండగా ఉండాలని ఇక్కడికొచ్చినట్లు అభిమానులు, వైసీపీ కార్యకర్తలకు వివరించారు. ముఖ్యంగా.. రవి ఎప్పుడూ నంద్యాల గురించే అలోచిస్తారని.. తన మిత్రులు ఏ రంగంలో ఉన్నా వారికోసం కచ్చితంగా వెళ్తానన్నారు. 2019లో తొలిసారి పోటీచేసినప్పుడు నియోజకవర్గ ప్రజలకు సందేశం మాత్రమే పంపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈసారి ఆయన వద్దన్నా కూడా తానే అభినందించడానికి వచ్చినట్లు తెలిపారు. శిల్పా రవి మంచి మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. మిత్రుడు భవిష్యత్తులో మరిన్ని మెట్లు ఎక్కాలని ఐకాన్ స్టార్ ఆకాంక్షించారు.
చండ్ర నిప్పులు!
ఇక నంద్యాల ప్రజాగళం సభలో చంద్రబాబు.. శిల్పారవిపై ఓ రేంజిలో విమర్శలు గుప్పించారు. శిల్పాను సండే ఎమ్మెల్యే అని చంద్రబాబు సంబోధించారు. సండే ఎమ్మెల్యేను శాశ్వతంగా ఇంటికి పంపించాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఇక్కడ్నుంచి పోటీచేస్తున్నా ఫరూక్‌ను గెలింపిచాలని ప్రజలను కోరారు. అదేవిధంగా భూమా బ్రహ్మానందరెడ్డికి రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పిస్తానని మాటిచ్చారు. చూశారుగా.. ఇదీ ఇవాళ్లి నంద్యాల షో!. ఒకరకంగా చెప్పాలంటే.. అల్లు అర్జున్‌పై మెగాభిమానులు, అల్లు అభిమానులు గట్టిగానే ఫైర్ మీదున్నారు. ఎందుకుంటే.. పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ కోసం ఒకే ట్వీట్ చేసి సరిపెట్టిన మీరు.. మిత్రుడి కోసం అది కూడా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నారు. రెండు నాలుకల ధోరణి అంటే ఇదేనని మరికొందరు మండిపడుతున్న పరిస్థితి. ఇక నంద్యాలలో బాబు తన అభ్యర్థిని గెలిపించుకుంటారా.. లేకుంటే తన మిత్రుడు శిల్పాను అల్లు అర్జున్ గెలిపించుకుంటారో చూడాలి మరి.