కాంగ్రెస్ కోసం వైసీపీ, జనసేన, టీడీపీ!
టైటిల్ చూడగానే కాస్త కన్ఫూజ్‌గా ఉంది కదా..! అవును కాంగ్రెస్ కోసం ఒకటా రెండా ఆరేడు పార్టీలు ఏకమయ్యాయి. వైసీపీ, జనసేన, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు ఇంకా లోకల్‌గా ఉన్న ఇండిపెండెంట్లు సైతం ఒక్కటయ్యారు. అక్కడ ఉన్నది మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి. చూశారుగా.. సీన్ అదిరిపోలా..! కాంగ్రెస్‌కు బద్ధ శత్రువు వైసీపీ.. ఇప్పుడు కూటమిగా బీజేపీ, జనసేన, బీజేపీ పార్టీలు పోటీచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీలన్నీ కలిసి ఒక్కడి కోసం పనిచేస్తున్నాయంటే ఆ కిక్కెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి! రండి.. అసలు కథేంటో తెలుసుకుందాం..!
ఇదబ్బా అసలు సంగతి!
తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరికొన్ని గంటల్లోనే మైకులు మూగబోయి.. పోలింగ్ జరగనుంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది. తెలంగాణలో కీలక పార్లమెంట్ స్థానమైన ఖమ్మం నియోజకవర్గంలో సీన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. కాంగ్రెస్ తరఫున ఎంపీగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ల వియ్యంకుడు అయిన రఘురామిరెడ్డి పోటీచేస్తున్నారు. ఈయన గెలుపుకోసమే ఇప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇక్కడ ఏకమయ్యాయి. స్వయంగా పొంగులేటి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. టీడీపీ బలపరిచిన, వైసీపీ బలపరిచిన.. జనసేన బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి.. తప్పకుండా ఓటేసి గెలిపించండి అని అభ్యర్థించారు. చూశారుగా.. ఇదన్న మాట సంగతి.
అక్కడున్నది పొంగులేటి!
ఖమ్మం జిల్లాలో పొంగులేటి రాజకీయాల్లోకి రాకమునుపు ఒక లెక్క.. ఆయన వచ్చాక ఇంకో లెక్క అన్నట్లుగా పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యమే. ఇప్పటి వరకూ ఖమ్మంలో కులాలు మాత్రమే పనిచేశాయ్. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. ఎందుకంటే ఆయన రేంజ్ అలాంటిది మరి. ఖమ్మం జిల్లా.. అటు ఆంధ్రా.. ఇటు తెలంగాణను రెండూ కవర్ చేస్తుంది..! 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఎమ్మెల్యేలుగా పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు గెలిచారంటే అర్థం చేసుకోండి. అలాంటిది ఇప్పుడు పొంగులేటి అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో సీన్ మొత్తం మారిపోయింది. జిల్లా మొత్తం ఈయన చేతిలోనే ఉంది. బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్కటి గెలవగా.. ఆ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చిన పరిస్థితి. అంటే ఇప్పుడు క్లీన్ స్వీప్ అన్న మాట. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో తన వియ్యంకుడు రఘురామిరెడ్డిని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు పొంగులేటి. నాలుగు పార్టీలు కలిశాయ్.. రఘురామిరెడ్డి పార్లమెంట్ తలుపు తడతారో లేదో చూడాలి మరి.