ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఇంకా మిగిలిపోయిన, చివరి అస్త్రాలను సంధించే పనిలో పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం విషయానికొస్తే.. ఇక్కడ్నుంచి వైసీపీ తరఫున యువనేత భూమా అభినయ్ రెడ్డి.. కూటమి తరపున జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు పోటీచేస్తున్నారు. రాయలసీమలో కచ్చితంగా జనసేన కొట్టే తొలి సీటు ఇదేనని అందరూ ధీమాలో ఉన్నారు. అయితే.. టీడీపీ, బీజేపీ నుంచి మాత్రం అంతంత మాత్రమే సపోర్టు ఉంది. దీంతో ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుందో ఏమోననే భయం మాత్రం జనసేనలో గట్టిగానే ఉంది. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ సరికొత్త ప్రచారానికి తెరతీసింది. తిరుపతి నియోజకవర్గ ప్రజలారా మళ్లీ మోసపోకండి.. అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ క్యాంపెయిన్ మొదలెట్టింది. ఇందులో సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవిల ప్రస్తావన కూడా ఉంది.
ఆలోచించండి అంటూ..!
తిరుపతి నియోజకవర్గ ప్రజలారా మళ్లీ మోసపోకండి.. ముచ్చటగా మూడోసారి తిరుపతి నియోజకవర్గ ప్రజలారా స్థానికేతరుల ముసుగులో మోసపోతారా? ఒక్క క్షణం ఆలోచించండి. అప్పట్లో స్థానికేతరులైన నందమూరి తారక రామారావు టీడీపీ తరఫున.. సిని నటుడు చిరంజీవి ప్రజారాజ్యం తరఫున తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నియోజవర్గ ప్రజలను గాలికి వదిలేసి హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన విషయం మరిచిపోయారా? వీరిద్దరి కారణంగా సంవత్సరం తిరక్కుండానే ఉప ఎన్నికలు రావడం కూడా చూడలేదా..? వీరు శాసన సభ్యులుగా ఉన్న సంవత్సరం రోజులు పాటు తిరుపతి నియోజకవర్గం నుంచి ఏ ఒక్కరు కూడా వీరిని కలిసిన దాఖలాలు లేవు. చివరికి శాసనసభ్యులుగా ఎక్కడైనా సంతకాలు పెట్టాలన్న హైదరాబాద్‌కు తమ పీఏలు ద్వారా పేపర్లు తెప్పించుకుని మరీ పెట్టి తిరిగి పంపించేవారు. వీరు పాలకులుగా ఉన్న సమయంలో తిరుపతి నగరంలో అభివృద్ధి అయితే శూన్యం. ఈ విషయం తిరుపతి నియోజకవర్గ ప్రజలు మొత్తానికి తెలిసిన విషయమే.
నేనున్నాను.. ఉంటాను!
మళ్లీ అదే రిపీట్ అవునందా? చిత్తూరు జిల్లా చిత్తూరు నగరం లక్ష్మీ నగర్ కాలనీలో శాశ్వత నివాసముండే ఆరని శ్రీనివాసులు అనే స్థానికేతుడు తిరుపతి శాసనసభకు పోటీ చేయడంతో ముచ్చటగా మూడోసారి స్థానికేతులు తిరుపతి నియోజకవర్గ ప్రజలను మోసం చేయనున్నారా? తిరుపతి నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మళ్లీ మోసపోకండి. జన్మతః తిరుపతి నియోజకవర్గంలోనే శాశ్వత నివాసంలో నివాసముంటున్న భూమన కుటుంబానికి చెందిన భూమన అభినయ్ రెడ్డి ఇప్పటికే తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్‌గా తిరుపతి నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించి తిరుపతి నియోజకవర్గ ప్రజల మన్ననలను పొందారు. తిరుపతి నగరంలో ఏ మూల చూసినా విశాలమైన రోడ్లు, రోడ్డుకి ఇరువైపులా సుందరీకరణ, శ్రీనివాస సేతు ఫ్లైఓవర్, వినాయక సాగర్ జలాశయం ఏర్పాటు, రోడ్లన్నీ విద్యుత్ కాంతులతో విరజెల్లడం మనమందరం చూసాం. తిరుపతి నగరంలో ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ జరగలేదని తిరుపతి పుర ప్రజలు ముక్తకంఠంతో మాట్లాడుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ముఖ్య కారణం ఆయన తిరుపతి స్థానికుడవడమే. ఒక తిరుపతి నియోజకవర్గంలోని యువకుడిగా స్థానికుడిగా భూమన అభినయ్ రెడ్డి శాసనసభ్యుడు అయితేనే తిరుపతి అభివృద్ధికి దోహదపడుతుంది.
ఇదీ సంగతి..!
చూశారుగా.. ఇప్పుడు నెట్టింట్లో ఇదే పెద్ద చర్చగా నడుస్తోంది. లోకల్.. నాన్ లోకల్ మధ్య నడుస్తున్న ఈ యుద్ధంలోకి ఎన్టీఆర్, చిరును కూడా లాగేసింది వైసీపీ. ఇదొక్కటే కాదు.. ఆరణికి టికెట్ ఇస్తామని ప్రచారం మొదలుకుని ఇచ్చిన నాటి వరకూ.. ఇంకా చెప్పాలంటే నేటి వరకూ ప్రతిదీ రాద్ధాంతమే అవుతోంది. ఇప్పుడు ఏకంగా నియోజకవర్గ ఓటర్లకు ఏ రేంజిలో బ్రెయిన్ వాష్ చేస్తున్నారో చూస్తున్నారుగా. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఓటరు ఎటువైపు ఉన్నారు.. ఎవర్ని గెలిపించబోతున్నారు.. అనేది చూడాలి మరి.