టైటిల్ చూడగానే.. ఇదేం విడ్డూరం బాబోయ్.. పోనీ పోలికలు ఉన్నాయా అంటే అదీ లేదు.. ఏంటిదని అనుకుంటున్నారు కదా..? అవునండోయ్ ఇప్పుడు తెలంగాణలో ఇదే నడుస్తోంది. గత పదేళ్లలో తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ఇచ్చిందేమీ లేదని ఇదిగో ఈ గాడిద గుడ్డే ఇచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో తెగ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. ఎక్కడా బహిరంగ సభ జరిగినా సరే పెద్ద గుడ్డుతో ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. దీంతో ఎక్కడ చూసినా ఈ గుడ్డు గురించే చర్చ నడుస్తున్న పరిస్థితి. ఈ ప్రచారంతో ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో రావాల్సినంత బ్యాడ్ నేమ్ వచ్చేసింది. దీంతో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా ఏర్పడటం.. సీన్‌లో నుంచి బీఆర్ఎస్ వెళ్లిపోయింది. అందుకే.. తాడో పేడో తేల్చుకోవడానికి రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.
తగ్గేదేలే!
మీరు గాడిద గుడ్డు అంటుంటే మేమేందుకు చూస్తూ ఊరుకుంటాం.. మాకేం చేతకాదా..? అంటూ బీజేపీ కౌంటర్ ప్లాన్ చేసింది. అధికారంలోకి వచ్చిన 120 రోజుల్లో తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ అంటూ క్యాంపెయిన్ షురూ చేసింది బీజేపీ. ముఖ్యంగా.. మహిళలు, నిరుద్యోగులు, రైతులు ఇలా అన్ని వర్గాల చేతిలో రేవంత్ వంకాయ పెట్టారని వినూత్నంగా కొట్టింది కమలం పార్టీ. వాస్తవానికి ఇలా వెరైటీగా ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీనే అనుకుంటే అంతకుమించిపోయింది బీజేపీ. దీంతో ఇప్పుడు ఎవరి నోట విన్నా.. టీవీల్లో చూసినా గాడిద గుడ్డు, వంకాయ గురించే చర్చ నడుస్తోంది. అయితే.. గాడిద గుడ్డే సూపర్ హిట్టయ్యింది అని వంకాయ వాడిపోయిందనే ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతోంది.
నాడు కేసీఆర్.. నేడు రేవంత్!
తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదన్నది ఇప్పుడు రేవంత్ చెప్పడం కాదు కానీ.. గత పదేళ్లుగా నడుస్తున్నదే. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇదే విషయాన్ని వేలసార్లు చెప్పి ఉంటుందేమో. అదే పరిస్థితిని ఇప్పుడు రేవంత్ కొనసాగించడం మంచి పరిణామమే. ఇదే ఫైర్ మీద కేంద్రంపై కొట్లాడి రాష్ట్రానికి రావాల్సినవి తెచ్చుకుంటే బాగుంటుంది. అలా కాదని.. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇదంతా చేస్తే మాత్రం అంతకంటే విడ్డూరం మరొకటి ఉండదు. దీనిపై చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వస్తున్నాయ్. ఎందుకుంటే మోదీని పెద్దన్న అని రేవంత్ తన నోటితో అనడం.. ఆ తర్వాత ఇప్పుడు తిట్టిపోయడం.. కేవలం 100 రోజుల్లోనే ఇలా రివర్స్ అయ్యి అటాక్ చేయడం ఏదో తేడా కొడుతోందని కూడా చర్చ నడుస్తోంది. ఏం జరుగుతుందో.. ఈ ఎన్నికల్లో గుడ్డు వెరీ గుడ్డు అని జనాలు ఓట్లేస్తారో లేకుంటే గుడ్డొద్దు.. వంకాయ ముద్దని కమలంపై గుద్దుతారో చూడాలి మరి.