ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మూడ్ మొదలైన నాటి నుంచి నిన్నటి వరకూ అభ్యర్థులు, బీఫామ్‌లు, నామినేషన్లు.. ప్రచారం, బహిరంగ సభలు, యాత్రలతో బిజిబిజీగా గడిపిన పార్టీల అధిపతులు, సీఎం అభ్యర్థులు ఇక చివరి అస్త్రాలు బయటికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఖరికి బూతులు సైతం మాట్లాడేస్తున్న పరిస్థితి. బాబోయ్ అవి కూడా పచ్చి.. అమ్మ నా బూతులు. ఒకటా రెండా ఎలా పడితే అలా.. ఎడాపెడా తిట్టిపడేస్తున్న పరిస్థితి. ఈ విషయంలో ఎవరేం తక్కువ తినలేదు.. వైసీపీని మంచి టీడీపీ.. టీడీపీని మించి వైసీపీ ఉన్నాయ్. అయితే.. చంద్రబాబు, పవన్ ఇద్దరూ సహనం కోల్పోయి మాట్లాడుతుండటం మాత్రం ఇదే తొలిసారి. ఈ మాటలు చివరి అస్త్రాలు అనుకోవాలా.. లేకుంటే మరేం అనుకోవాలో పార్టీ శ్రేణులకు అర్థం కాని పరిస్థితి.
ఎందుకిలా..?
చంద్రబాబు ఎంతసేపూ తన రాజకీయ అనుభవం, చాణక్యతను ప్రదర్శిస్తూ ఎక్కడా మాటలు దొర్లకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుంటారు. అదీ విమర్శలు చేసినా చాలా లాజిక్‌గా తిట్టినా తినట్టు కాకుండా ఉంటాయ్. అలాంటిది తల్లి మొగుడు.. అమ్మమ్మ మొగుడు.. నాన్నమ్మ మొగుడు లాంటి మాటలు చంద్రబాబు నోటి నుంచి వచ్చాయంటే సొంత పార్టీ నేతలే అవాక్కవుతున్న పరిస్థితి. ఇక పవన్ అంటారా.. జగన్ నీ అమ్మ మొగుడెవరో నాకు తెలియదు.. అనడం ఎంతవరకూ సబబు అనేది ఆయనకే తెలియాలి. విమర్శలు చేయొచ్చు.. ఇందులో ఎలాంటి తప్పులేదు.. చీటికి మాటికి పవన్ భార్యల గురించి జగన్ మాట్లాడుతుంటారు.. అందుకు తగ్గట్టుగానే కౌంటర్ ఇవ్వాలి కానీ.. ఇలా మాట్లాడితే ఏం వస్తుందనేది తెలుసుంటే మంచిదేమో. వ్యూహాలు, విమర్శలు, కౌంటర్లు.. ఒకానొక దశలో రివర్స్ అవుతుంటాయ్.. ఏవైతే బంపర్ హిట్టవుతాయ్ అని అనుకుంటారో అవే అట్టర్ ప్లాపూ అవ్వొచ్చు సుమీ..!. ఇక వైసీపీ అంటారా అబ్బే తక్కువేం కాదు.. జగన్ నేరుగా అని ఉండకపోవచ్చు గాక ఆ పార్టీ నేతలు ఎంతమంది ఎన్నెన్ని మాటలు అనలేదు చెప్పండి..! ఇక ముద్రగడ పద్మనాభం అయితే పవన్, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే పనిలోనే 24/7 ఉన్నారు.
ఇంటర్వ్యూలతో ఇరగతీసేద్దాం!
ఇక తిట్ల్ల సంగతి అటుంచితే.. సీఎం అభ్యర్థులైన చంద్రబాబు, జగన్ ఇద్దరూ చివరి అస్త్రాలుగా ఇంటర్వ్యూలను ఎంచుకున్నారు. అమెరికా లాంటి దేశాల్లో అయితే అభ్యర్థులు ఎదురెదురుగా నిల్చుని ఇంటర్వ్యూలు, ఎందుకు అధికారం ఇవ్వాలి..? అధికారంలోకి వస్తే ఏం చేస్తారు..? అనేది లైవ్ డిబేట్ ఉంటుంది. బహుశా ఇది తెలుగు రాష్ట్రాల్లో ఇంకో ఐదారు దఫాలకు కూడా జరగకపోవచ్చు. దీంతో ఎవరికి అనుకూలంగా ఉండే టీవీ చానెల్స్, దినపత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లియర్ కట్‌గా ఇంకా మిగిలిన వ్యూహాలేంటి..? రాజధాని విషయం, వైసీపీని కుదిపేస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. ఇన్నాళ్లు చేసిన అభివృద్ధి.. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాలను జగన్ చెప్పుకుంటూ పోతున్నారు. చంద్రబాబు కూడా.. ఈసారి అధికారం ఇస్తే చాలు తానేంటో నిరూపించుకుంటాను.. చూపిస్తానన్నట్లు చెబుతున్నారు. తెలుగు జాతి నంబర్ వన్‌గా నిలపాలన్నదే టార్గెట్ అని.. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానని ధీమాకు చంద్రబాబు చెబుతున్న పరిస్థితి. ఇంకా ప్రజల్లో పార్టీపై నెలకొన్న ధర్మ సందేహాలకు అటు జగన్.. ఇటు చంద్రబాబు నివృతి చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చారు. చివరి అస్త్రాలు ఏ మాత్రం వర్కవుట్ అవుతాయి అనేది జూన్-04న తేలిపోనుంది మరి.