పోసానీ.. కళ్లు తెరిచి ఇటు చూడు!!
మెగాస్టార్ చిరంజీవి.. రెండు మూడ్రోజులుగా ఎవరి నోట విన్నా.. సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఎక్కువగా వినిపించే, కనిపించే పేరు! ఎందుకంటే.. పిఠాపురం నుంచి పోటీచేస్తున్న తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. పవన్‌ను ఎందుకు గెలిపించాలి..? గెలిపిస్తే ఏం చేస్తాడు..? అనే విషయాలను ఓ వీడియో రూపంలో నిశితంగా వివరించారు. అదిగో అలా వీడియో వదిలారో లేదో వైసీపీ విషం కక్కడం మొదలైంది. కార్యకర్తలు నెట్టింట్లో.. నేతలు మీడియా గొట్టాల ముందు ఇదే పనిగా పెట్టుకున్నారు. ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేయడం.. నోటికొచ్చిందల్లా అనేస్తూ రచ్చ రచ్చే చేస్తున్నారు. బాబోయ్.. కొందరు చేస్తున్న కామెంట్స్ అయితే కళ్లల్లో రక్తం దిగేలా ఉన్నాయ్.!
ఇంతలా ఎందుకబ్బా..?
నిన్న, మొన్నటి వరకూ వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం.. పవన్, మెగా ఫ్యామిలీపై ఎంతటి పైత్యం ప్రదర్శించారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆఖరికి పవన్ భార్యల గురించి.. మెగా ఫ్యామిలీలోని ఆడపిల్లల గురించి మాట్లాడుతూ నానా రచ్చే చేశారు. దీంతో వైసీపీకి ఏ మాత్రం కలిసొచ్చిందో.. జనసేనకు ఎంత మైనస్ అయ్యిందో ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడిక నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీని హైకమాండ్ రంగంలోకి దింపింది. పోసానీ ఇప్పుడిక మీ వంతు.. మీకిచ్చిన ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవికి చివరి నిమిషంలో న్యాయం చేయండని చెప్పారేమో కానీ.. అబ్బో అదేదో పాత పగలు, ఇద్దరి మధ్య ఫ్యాక్షన్ నడిచినట్లు, బద్ధ శత్రువులుగా చిరును చూస్తూ పోసాని మాట్లాడటం గమనార్హం.
ఇవేం మాటలు!
రాజకీయాలు సరిపోవంటూ వదిలేసి వెళ్లిపోయిన చిరంజీవి.. మళ్లీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించడమేంటి..? పాలిటిక్స్‌కు దూరమైతే మాట్లాడకూడదని ఏమైనా రూల్ ఉందా..? ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుందా..?. జనసేనకు ఓటు వేయమని ఎలా కోరుతారంటున్నారు సరే.. అవును అడిగితే తప్పేంటి..?. ప్రజలంటే చిరుకు చాలా చీప్ అని.. వాళ్లేం చేస్తారులే అనుకుంటారన్నారని అంటున్నారు సరే.. ప్రజల కోసం ఆయన చేసిన సేవలు మరిచిపోతే ఎలాగబ్బా..?. మెగాస్టార్ వెరీగుడ్ బిజినెస్ మ్యాన్ అని.. సినిమాల్లో టాప్ హీరో అని చెప్పుకొచ్చారు. అవును మీరు చెప్పేది అక్షరాలా నిజమే ఎందుకంటే సినిమా చేసి నిర్మాతలకు నాలుగు డబ్బులు తేవడంలో కచ్చితంగా బిజినెస్ మ్యానే..!. చిరంజీవి ప్రజారాజ్యం పెడితే 18 సీట్లు వచ్చాయి.. ఏ రోజైనా రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నించారా? ఒక్కసారి రికార్డుల్లోకి వెళ్లి అసెంబ్లీలో ఎవరేం మాట్లాడారు..? ఏయే విషయాలపైన మాట్లాడరన్నది చెక్ చేసుకుంటే అర్థమవుతుంది.
ప్రశ్నించలేదా..?
ఇక పుష్కరాల సమయంలో పదుల సంఖ్యలో జనాలు చనిపోతే నాడు చంద్రబాబును నిలదీసి.. నిగ్గదీసి అడిగిన విషయం గుర్తు లేదా.. దీన్ని ప్రజా సమస్య అనరా.. ప్రశ్నించడం అనరా పోసానీ..?. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో అయినా కూర్చున్నారా..? ముఖ్యమంత్రి అయితే ఎంజాయ్ చేద్దాం.. ఓట్లు వేయకపోతే వెళ్లిపోదాం అనుకున్నారని సంచలన ఆరోపణలే చేశారు సరే.. ఆయన రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా ఏమేం చేశారన్నది మీకు తెలియదా..? తమరు కూడా పార్టీలోనే ఉన్నట్లు గుర్తు కదా.. ఒకసారి నెమరవేసుకోండి. రాజకీయం అనేది చిరు దృష్టిలో బిజినెస్ అంటున్నారు.. ఇదే నిజమైతే ఆయన ఏ మాత్రం బిజినెస్ చేసి సంపాదించుకున్నారా..? ఉన్నది పోగొట్టుకున్నారా..? అనేది నాడు పార్టీలో ఉన్నోళ్లను అడిగి తెలుసుకోండి. చిరంజీవి వెన్నుపోటు పొడిచినందుకు కాపు యువత, కాపు నేతలు బలయ్యారని చెబుతున్నా పోసానీ.. అదే కాపు సామాజిక వర్గం నుంచి ఎంత మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు..? ఎంతమందిని తెరపైకి తెచ్చి రాష్ట్రానికి పరిచయం చేశారన్నది మరిస్తే ఎలాగబ్బా..?. అవును తమ్ముడి తరఫున ప్రచారం చేయడంలో వందకు వెయ్యి శాతం తప్పులేదు తప్పని ఎలా నిరూపిస్తావో నిరూపించన్నది అభిమానుల నుంచి వస్తున్న ప్రశ్న.
ఇటు చూడు పోసాని..!
ప్రజలకు సేవ చేయాలనే.. మనిషిగా పుట్టాక సేవాగుణం ఉండాలనే కదా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి ఎంతటి సేవలు చేస్తున్నారన్నది మరిచిపోతే ఎలా పోసానీ..? పోనీ ఇండస్ట్రీలోని నిరుపేదలకు ఎంతమందికి సాయం చేశారు.. అనేది మీకు తెలుసా..? సినిమాల్లోకి రావడానికి.. వచ్చాక ఆయన పడిన కష్టాలు మీకు తెలుసా..? రాజకీయాల్లోకి వచ్చి తనను ఈ స్థాయికి తెచ్చిన ప్రజలు, వీరాభిమానులకు సేవ చేసుకోవాలని సినిమాలకు సైతం గుడ్ బై చెప్పేసి చిరు చెడ్డోడు ఎలా అవుతారు..? పోనీ ప్రజారాజ్యం సమయంలో ఆయన బిజినెస్ చేసే వాళ్లకే టికెట్లు ఇచ్చారా..? కన్నబాబు, వంగా గీత లాంటి ఎంతో మంది సామాన్యులకు టికెట్లు ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఏం చేశారన్నది ఒక్కసారి మీ పార్టీ మాజీ నేత, ఎంపీ వల్లభనేని బాలశౌరిని అడిగితే క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు పార్టీ విలీనం సమయంలో ఉన్నోళ్లు చాలా మంది ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు కదా.. వారందరూ చిరు గురించి ఎందుకు నోరు మెదపట్లేదు.. ఎందుకంటే చిరంజీవి అంటే ఏంటి..? ఎలాంటి వారు.. రాజకీయాల్లోకి వచ్చాక ఏం చేశారు.. అనేది వారికి తెలుసు కాబట్టి ఎక్కడా పొరపాటున కూడా తప్పుగా మాట్లాడరు కూడా. అందుకే కాస్త కళ్లు తెరిచి చూసి.. ఎవరినైనా అడిగి విచారించుకున్నాక చిరు గురించి మాట్లాడితే బాగుంటుంది పోసానీ.. అని మెగాభిమానులు, జనసేన శ్రేణులు గట్టిగా ఇచ్చిపడేస్తున్నాయి.