జగన్ చేతులు ఎత్తేసినట్టేనా..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీల అధినేతలు చివరిగా మిగిలున్న అస్త్ర శస్త్రాలు బయటికి తీసే పనిలో ఉన్నాయి. ఐతే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎందుకో ఎన్నికల ముందే చేతులు ఎత్తేసినట్టుగా మాట్లాడటం గమనార్హం. ఆయన తాజాగా చేసిన కామెంట్స్ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసింది. ఇదే కూటమి పార్టీలకు పెద్ద అస్త్రంగా మారింది.
ఏమైంది జగన్!!
సిద్ధం, మేమంతా సిద్ధం యాత్రలతో రాష్ట్రం అంతా తిరిగిన జగన్.. ఇప్పుడు ప్రచారంలో ఫైనల్ టచ్ ఇస్తున్నారు. సోమవారం నాడు
మచిలీపట్నం సభలో జగన్ మాట్లాడుతూ.. కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని ఆవేదనకు గురయ్యారు. అంతేకాదు.. ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం లేదన్నారు. అంటే ఎన్నికల్లో ఏదో జరగరానిది జరుగుతుందని ముందే ఊహించుకొని చెబుతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఇక అమల్లో ఉన్న పథకాల డబ్బులు కూడా ప్రజలకు చేరకుండా ఆపుతున్నారని కూటమిపై ఆరోపణలు చేశారు. ఇక ఇన్నాళ్లు వైసీపీకి తొత్తుగా పనిచేసిన ఎస్సై మొదలుకుని పోలీస్ బాస్ డీజీపీ రాజేంద్రనాథ్ వరకూ భారీ సంఖ్యలో అధికారులను ఎన్నికల కమిషన్ బదిలీలు, సస్పెండ్ చేసింది. దీనిపై జగన్ స్పందిస్తూ ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని ఒకింత అనుమానించారు. అంతేకాదు.. పేదలకు మంచి చేస్తున్న తనను లేకుండా చేయాలని కూటమి నేతలు కుతంత్రాలు పన్నుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు.
ఆధారాలేవీ సామీ!
తనపై కుట్రలు, కుతంత్రాలు అంటున్న జగన్.. కనీసం అవేమిటో కూడా చెప్పడం లేదు. పోనీ ఆ కుట్రలు ఏంటో చెబితే జనాలకు తెలుస్తుంది.. తమరికే మంచి మైలేజ్ వస్తుంది.. అది వైసీపీకి ప్లస్ పాయింట్ కదా.. ఈ లాజిక్ ఆయన ఎలా మరిచారో ఏంటో మరి. ఇక అధికారుల బదిలీలు అంటారా.. వాళ్ళు సక్రమంగా పని చేసి ఉంటే ఎందుకు ఈ తిప్పలు వచ్చేవి..? పోనీ పోలీసు అధికారులు ఎప్పుడైనా ఏకపక్షంగా కాకుండా సామాన్యులు, ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులు ఎందుకు పట్టించుకోలేదు..? ఏ డీజీపీ ఉన్నప్పుడు ఇన్ని గొడవలు, శాంతి భద్రతలు ఫెయిల్ అన్నట్లు వార్తలు ఎందుకు వచ్చాయి. ఇదీ కాదు ఎన్నికల టైంలో కూటమి కార్యకర్తలు, నేతలు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు.. అదే వైసీపీ నేతలు చెప్పిన వెంటనే రంగంలోకి డీజీపీ హడావుడి చేసేవారు. ఇక పేదలకు పథకాలు అంటారా..? ఎన్నికల రెండు, మూడు రోజుల్లోనే అవన్నీ ఎందుకు గుర్తుకు వచ్చాయి..? ఇన్ని రోజులు ఏం చేశారు..? ఈ ప్రశ్నలకు సమాధానం ఏదీ..!! చూశారుగా జగన్ మాటలు.. దీన్ని బట్టి మీకేం అర్థం అయ్యిందో చెప్పండి మరి..!!