ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు.. అన్నది మొదలుకుని ఇవాళ్టి వరకూ ఒక్కటే చర్చ. వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏం మాట్లాడుతారు..? ఇది వరకు జరిగిన సభలో జగన్ పేరు కూడా ప్రస్తావించని ప్రధాని ఈసారైనా కనీసం మాట్లాడి.. జగన్ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి మాట్లాడి, విమర్శలు గుప్పిస్తారా..? అని ఒక్కటే చర్చ జరిగింది. అంతే కాదు కూటమిలో ఉంటూనే వైసీపీతో మోదీ సంసారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు సైతం ఒకింత అనుమాన పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఐతే ఆ అనుమనాలు.. మరెన్నో ప్రశ్నలకు రాజమండ్రి సాక్షిగా సమాధానాలు దొరికాయి. ఇంకెందుకు ఆలస్యం రండి మోదీ ఏం మాట్లాడారో తెలుసుకుందాం..!!
తెలుగులో షురూ చేసి..!
ఎన్నికల ప్రచారంలో ప్రధాని తెలుగులో ప్రసంగం ప్రారంభించి.. ఆంధ్రా కుటుంబసభ్యులకు నమస్కారాలు తెలియజేశారు. ఈ నేల నుంచే ఇప్పుడు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నామని చెప్పుకొచ్చారు. దేశంలో, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మే 13న ఏపీలో కొత్త ఆధ్యాయం కాబోతుందని.. ఎన్నికల్లో వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని మోదీ జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధి గతి తప్పిందని.. రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించిందని దుయ్యబట్టారు. ఇక చంద్రబాబు పాలనలో అభివృద్ధిలో నెంబర్‌వన్‌గా ఏపీ నిలిచిందని తెలిపారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ప్రతిభావంతులైన యువతకు నెలవు ఏపీ అని.. అలాంటిది అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం ఉందని జగన్ సర్కారును ఏకిపడేశారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని రాష్ట్ర ప్రజలకు తెలిపారు.
వైసీపీ ఏం చేసింది..?
కేంద్ర ప్రాజెక్టుల అమలును వైసీపీ ప్రభుత్వం ఎన్నడూ పట్టించుకోలేదని.. ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయం ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ఐతే అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్‌గా తయారయ్యి.. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్‌తో పరిగెత్తిందని ఆయన అన్నారు. మూడు రాజధానులు చేస్తామన్న జగన్ ఒక్కటీ చేయలేదని.. మూడు రాజధానుల పేరుతో ఏపీని లూటీ చేసిన వైసీపికి ఆర్థిక నిర్వహణ అంటే ఏంటో తెలియదన్నారు. వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప..రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఖజానాను వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసిందనీ ఆరోపించారు.. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలని భావించింది కానీ.. కేంద్ర నిధులను వైసీపీ సర్కారు అందుకోలేకపోయిందన్నారు. పోలవరానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చిందని.. ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఆపేసిన పరిస్థితి ఉందన్నారు. మోదీ గ్యారెంటీ.. బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం ఏపీకి అవసరం అని రాష్ట్ర ప్రజలకు చెప్పారు. మొత్తానికి చూస్తే ప్రధాని పర్యటనతో కూటమిలో ఫుల్ హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు. ఐతే ఎక్కడా కూటమి మేనిఫెస్టో.. విభేదాలు గురుంచి మోదీ ప్రస్తావన తీసుకొని రాకపోవడం గమనార్హం. ఇన్ని మాటలన్న మోదీకి వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో.. అసలు అధికార పార్టీ అంత సాహసం చేస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది.