బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వైఎస్ షర్మిల రెండు సార్లు గిఫ్ట్ పంపిన విషయం గుర్తుంది కదా..! ఒకసారి షూలు, ఇంకోసారి తెలంగాణ ప్రజలు బై బై కేసీఆర్ చెబుతున్నారంటూ రాసి ఉన్న సూట్ కేసును పార్శిల్ చేసి పంపారు. ఇదంతా తెలంగాణ ఎన్నికలకు ముందు జరిగిన తంతు. ఇప్పుడు ఇదే సీన్ ఏపీలో రిపీట్ అవుతోంది. తెలంగాణలో తట్టాబుట్టా సర్దేసి ఏపీలో ఎన్నికల ముందు వాలిపోయిన షర్మిల పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. నిద్ర లేచింది మొదలుకుని నిద్రపోయే వరకూ షర్మిల నోట జగన్.. జగన్ అనే మాటే వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఓట్లను చీల్చేయాలని.. సొంత అన్న అయినా సరే దెబ్బ కొట్టాల్సిందేనని గట్టిగానే తిరుగుతున్నారు. అయితే.. జగన్ మాత్రం చెల్లి ఎక్కడ డిపాజిట్లు కోల్పోతుందో అనే సందేహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొదట షర్మిల మాటలను పెద్దగా పట్టించుకోని జగన్.. ఈ మధ్య చెల్లి అని కూడా చూడకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం చెల్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అన్నకు గిఫ్ట్‌గా అద్దం పంపారు.
ఇంతకీ ఎందుకీ అద్దం!!
టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తుగా షర్మిల మారారని.. ఆయన కోసమే పనిచేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలే చేశారు జగన్. ఆఖరికి పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నివాసానికి వెళ్లిన విషయాన్ని కూడా ప్రస్తావించడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి గాను షర్మిల.. బాబు ఇంటికెళ్లిన సమయంలో పసుపు చీరతో వెళ్లారు. దీన్ని కూడా రాజకీయం చేసిన జగన్.. చెల్లిపై విమర్శలు గుప్పించారు. జగన్ తన గురించి మాట్లాడిన మాటలన్నింటికీ షర్మిల గట్టిగానే బదులిచ్చారు. ఇప్పుడు ఏకంగా గిఫ్ట్ కూడా పంపించారు. జగన్ అన్నా.. మీరు ఈ అద్దం తీసుకోని మీ ముఖం చూస్కోండి.. అద్దంలో కూడా మీకు మీరు కనిపిస్తారో లేకుంటే.. చంద్రబాబు ముఖం కనిపిస్తుందో చూస్కోండని మాటలతోనే గట్టిగానే ఇచ్చిపడేశారు షర్మిల.
ఎవరికోసం.. ఎందుకోసం!?
అంతటితో ఆగని షర్మిల.. జగన్ మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు.. కంట్రోల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయా..? పోనీ ఒక్క సాక్ష్యం అయినా చూపించగలరా అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ ఒక భ్రమలో ఉన్నాడని మాత్రం స్పష్టంగా అర్థమవుతోందని.. ఆయన వైఖరి చూస్తుంటే మాలోకంను తలపిస్తోందన్నారు. ఈ జన్మకు చంద్రబాబును ఒక్కసారి మాత్రమే కలిశానని.. అది కూడా కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికేనని షర్మిల క్లారిటీగా చెప్పారు. ఇవన్నీ కాదు.. తాను
చంద్రబాబు చెబితే మీకోసం (జగన్ కోసం) 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానా..? బై.. బై.. బాబు అనే క్యాంపెయిన్ చేశానా? అని జగన్‌కు సూటి ప్రశ్నలు సంధించారు షర్మిల. చూశారుగా.. జగన్‌ను అన్నా.. గారు అని మాట్లాడుతూనే షర్మిల ఏ రేంజిలో ఇచ్చి పడేశారో. ఇక వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.