మోదీ రాక.. కూటమి మేనిఫెస్టోలో మార్పులు!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఇటీవల రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏ రేంజ్‌లో పేలిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించడంతో ఏ ఇద్దరు కలిసినా మేనిఫెస్టోపైనే చర్చించుకుంటున్న పరిస్థితి. అటు సోషల్ మీడియా.. ఇటు మీడియా.. ఇంకా ప్రకటనలు.. భారీ బహిరంగ సభలతో మేనిఫెస్టోను గట్టిగానే జనాల్లోకి తీసుకెళ్లో ప్రయత్నాలు కూటమి చేస్తోంది. అయితే.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది. మేనిఫెస్టోలో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయన్నదే ఆ వార్త సారాంశం. ఇందులో నిజమెంతో తెలియట్లేదు కానీ.. గత 48 గంటలుగా ఇదే చర్చ నెట్టింట్లో నడుస్తోంది.
ఏం జరగబోతోంది..?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 50 ఏళ్లకు పెన్షన్, గ్యాస్ సిలిండర్లు, నగదు లాంటి పథకాలతో మేనిఫెస్టోను టీడీపీ, జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక్కడే కూటమితో బీజేపీకి చెడిందనే వార్తలు గుప్పుమన్నాయి. మేనిఫెస్టో మేకింగ్ మొదలుకుని.. బ్రోచర్, ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన హడావుడి గురించి, బీజేపీ నేతలు చేసిన రచ్చ గురించి ఇక తెలియనిదేమీ కాదు. అయితే.. ప్రధాని మోదీ ఏపీకి విచ్చేస్తుండటంతో కొన్ని కీలక మార్పులు, చేర్పులు చేయాలని ఢిల్లీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఫోన్ వచ్చిందని టాక్ నడుస్తోంది. అలివిగాని హామీలే ఎక్కువ ఉండటంతో ఈ పథకాలతో ఖజానా మీద మరింత ఆర్థిక భారం పడదా..? రాష్ట్రం దివాళా తీయదా..? అని ఏపీ కమలనాథులు కొందరు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వారి నుంచే ఢిల్లీకి ఫిర్యాదు వెళ్లడం.. తామిచ్చిన సూచనల మేరకు మార్పులు చేయాల్సిందేనని క్లయర్ కట్‌గా ఆదేశాలు జారీ చేశారట.
సారొస్తున్నారు..!
ఈ మార్పులు, చేర్పుల తర్వాత మేనిఫెస్టో బ్రోచర్‌పై మోదీ ఫొటో కూడా ముద్రించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీ నుంచి ఫోన్ కాల్‌లో పెద్దలు చెప్పినట్లు సమాచారం. అంతేకాదు.. ఏపీ పర్యటనకు రాకముందే ఇదంతా జరిగిపోవాలని, సర్వం సిద్ధం అని చెప్పాకే రాష్ట్రానికి వస్తానని మోదీ చెప్పినట్లు ఫోన్‌కాల్‌లో వివరించారట. అయితే.. ఒక్కసారి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మళ్లీ మార్పులు అయ్యే పనేనా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అయితే చేర్పులు మాత్రం చేయడానికి వీలుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అబ్బే ఇదంతా ఉండకపోవచ్చు కానీ.. మోదీ మాత్రం కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని మాత్రం కమలనాథులు చెబుతున్న మాట. ఇంతకీ మేనిఫెస్టోలో మార్పుల్లో నిజానిజాలెంత అనేది తెలియాల్సి ఉంది.. ఏం జరుగుతుందో చూడాలి మరి.