రోజాకు నగరి సారీ చెబుతోంది..!!
వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతున్నారా..? వైసీపీ నేతలే ఆమెను ఇంటికి పరిమితం చేయాలని భావిస్తున్నారా..? రోజా వద్దు మహాప్రభో అని నియోజకర్గ ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారా..? అంటే తాజాగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను చూస్తే రోజాకు నగరి సారీ చెబుతోందన్నది అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది..? సరిగ్గా ఎన్నికల ముందు ఏం జరిగింది..? మరీ ఇంతలా మంత్రిపై పగబట్టిందెవరు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇదీ అసలు సంగతి!
ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యేను గెలిపించడానికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు.. వార్డు మెంబర్లు ఎలాంటి పాత్ర పోషిస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గెలుపోటములను నిర్ణయించేది ఈ ద్వితియ శ్రేణి నేతలే. అలా జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పనిచేసినవారు ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు.. ఇది జగమెరిగిన సత్యమే. అలాంటిది గ్రౌండ్ లెవల్‌లో ఈ ద్వితియ శ్రేణి నేతలంతా ఎదురు తిరిగితే.. ఎమ్మెల్యే గెలవడం సాధ్యమయ్యే పనేనా..? వందకు వెయ్యి శాతం అస్సలు కాదంటే కాదు. సరిగ్గా ఇప్పుడు రోజా కూడా నగరి నియోజకవర్గంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకరా ఇద్దరా నియోజకవర్గంలోని ద్వితియ శ్రేణి నేతలంతా దాదాపు రోజాకు వ్యతిరేకమయ్యారు. ఆఖరి నిమిషంలో రాజీనామాలు చేసేసి పార్టీ నుంచి బయటికొచ్చేస్తున్న పరిస్థితి.
ఇందులో నిజమెంతో..!
2019 ఎన్నికల్లో రోజా గెలిచి నాటి నుంచే నగరిలో వర్గాలుగా విడిపోయి నేతలు తన్నుకుంటూనే ఉన్నారు. నాడు మొదలైన ఈ రచ్చ జిల్లా మంత్రులు, పెద్దలు.. ఆఖరికి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి రంగంలోకి దిగి పరిష్కరించాలని చూసినా గొడవలు సద్దుమణగలేదు. దీంతో అప్పట్నుంచే రోజాను సైడ్ చేయాలని పార్టీ భావించినప్పటికీ.. ఇప్పటికిప్పుడు అభ్యర్థి దొరకరని ఎటూగానీ పరిస్థితుల్లో మళ్లీ టికెట్ ఇచ్చారనే ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఎందుకీ గొడవలు, ఎందుకింతలా రోజాపై వ్యతిరేకం అనే విషయానికొస్తే బాబోయ్.. రాజీనామా చేసిన నేతల మాటలు వింటే బాబోయ్.. నిజమా అంటూ ముక్కున వేలేసుకుంటారేమో. అయితే ఇందులో నిజానిజాలెంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
ఆరోపణలు ఇవీ..!
రోజాను చంద్రముఖితో పోలుస్తూ.. నగరిని చంద్రముఖి ఆవహించిందని నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి ఒక్కరే కాదండోయ్.. ఆయన సోదరులు కూడా కమిషన్ కింగ్‌లు అని.. కోట్ల రూపాయిలకు పడగలెత్తారని నేతలు చెబుతున్న పరిస్థితి. చిన్నపాటి పోస్టుకు 5 లక్షలు, ట్రాన్స్‌ఫర్ అడిగితే 10 లక్షలు.. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే 10 శాతం కమిషనట. అబ్బో ఇక ఇసుక, మట్టి గురించి అయితే మాటల్లో చెప్పక్కర్లేదని నేతలు చెబుతున్నారు. నేతలు చెబుతున్న మాటలను చూస్తుంటే సర్వం దోపిడీయేనని స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదండోయ్.. తాము చెప్పినవన్నీ అక్షరాలా నిజమని కాణిపాకంలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని చక్రపాణి రెడ్డి, లక్ష్మీపతి రాజు, మురళీ రెడ్డిలు చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఐరన్ లెగ్ ముద్ర ఉన్న రోజాను గోల్డెన్ లెగ్ చేసింది తామేనని.. ఇప్పుడు రోజాను ఓడించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని నేతలు చెబుతుండటం గమనార్హం. మే-13న, జూన్-04న ఏం జరుగుతుందో చూడాలి మరి.