ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కీలక దశకు చేరుకునే కొద్దీ పార్టీలు మరింత జోరుపెంచాయి. ఆఖరి నిమిషం వరకూ ఎలాంటి అస్త్రాలు ఉన్నా సరే సద్వినియోగం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలే చేస్తున్నాయి. ఇక వైసీపీ అయితే కుటుంబాల మధ్య, తండ్రీ పిల్లల మధ్య కూడా చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నదంటే రాజకీయాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను.. కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏ రేంజిలో తిట్టి పోస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఖరికి పవన్ గెలిస్తే తాను పేరు మార్చుకుంటానని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ముద్రగడ అమ్ముడుపోయారని.. ప్యాకేజీ తీసుకునే ఇలా చేస్తున్నారనే ఒక్కటే విమర్శలు వెల్లువెత్తాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ముద్రగడ కుమార్తె క్రాంతి స్పందించారు.
అయ్యో ముద్రగడ..!
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి వైసీపీ నేతలు ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారని.. ఆఖరికి నాన్న బాధాకరమైన ఛాలెంజ్ చేశారని ఒకింత తీవ్ర ఆవేదనకు లోనయ్యారు క్రాంతి. పవన్ గురించి ఎందుకిలా మాట్లాడుతున్నారో.. ఆయన కాన్సెప్ట్ ఏంటనేది అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన కుటుంబ సభ్యురాలినైన తనకు.. అభిమానులకు కూడా నచ్చలేదన్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించుకోవడానికి కష్టపడొచ్చు కానీ.. పవన్, ఆయన ఫ్యాన్స్‌ను అవమానించేలా మాట్లాడటం ఏ మాత్రం సబబు కాదని హితవు పలికారు క్రాంతి. పవన్‌ను తిట్టించేందుకు తన తండ్రి ముద్రగడను జగన్ పావుగా వాడుతున్నారని.. ఎన్నికల తర్వాత నాన్నను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా అని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా నాన్నను వ్యతిరేకిస్తున్నానని.. పవన్‌ను గెలిపించడానికి తన వంతుగా కృషి చేస్తానని తేల్చి చెప్పేశారు.
నా ప్రాపర్టీ కాదబ్బా..!
కుమార్తె క్రాంతి వ్యాఖ్యలకు ముద్రగడ కూడా గట్టిగానే స్పందించారు. అయితే చాలా లాజిక్‌గా మాట్లాడారు. కుమార్తె వ్యాఖ్యలకు భయపడనని.. ఆమె ఇప్పుడు తన ప్రాపర్టీ కాదని ఒక్క మాటతో క్లియర్ కట్‌గా చెప్పేశారు. అంతేకాదు.. కుమార్తె పెళ్లి కాకముందు తన ప్రాపర్టీ.. పెళ్లి అయ్యాక అత్తగారి ప్రాపర్టీ అన్నారు. ఆఖరికి తన కుమార్తె దగ్గర కూడా వీడియో చేపించారన్నారు. ఎవరు బెదిరించినా బెదిరిపోనని.. జగన్ మోహన్ రెడ్డికి సేవకుడిలాగా పనిచేస్తానన్నారు. కొందరు పనిగట్టుకుని తనకు.. తన కుమార్తె మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ముద్రగడ చెప్పుకొచ్చారు. తన పరిస్థితి.. రేపొద్దున్న పెండెం దొరబాబుకు కూడా రావొచ్చని (ప్రెస్‌మీట్‌లో పక్కనే కూర్చొని ఉన్న పెండెంను చూపిస్తూ) ముందస్తుగా హెచ్చరించారు. చూశారుగా.. ముద్రగడను సొంతిటి మనుషులే లెక్క చేయలేదంటే ఇక కాపులు ఆయన్ను ఏ మాత్రం గౌరవించి ఓట్లేస్తారో అని ఒకింత వైసీపీలో ఆందోళన మొదలైంది. ఎన్నికలు కదా.. ఏమైనా జరగొచ్చు మరి.