మోదీ మెగా సపోర్ట్.. కూటమిలో ఫుల్ జోష్!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతామని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. కూటమి కట్టినప్పటి నుంచి.. మేనిఫెస్టో రిలీజ్ వరకూ ఎలాంటి చిచ్చు.. రచ్చ రేగిందనే వార్తలు నిన్న, మొన్నటి వరకూ ఏ రేంజ్‌లో వచ్చయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆఖరికి నామినేషన్లు విత్ డ్రాకు గడువు ముగిసింది కాబట్టి సరిపోయింది లేకుంటే.. కూటమి నుంచి బీజేపీ బయటికొచ్చేసిందన్నట్లుగా సీన్ క్రియేట్ అయ్యింది. ఇందుకు కారణం ఏపీలోని కమలనాథులు కొందరు మేనిఫెస్టోపై చిత్ర విచిత్రంగా మాట్లాడటంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది. సీన్ కట్ చేస్తే.. ఆ అనుమాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేస్తున్నారు. బిగ్‌బాస్ రాకతో సీన్ మొత్తం మారిపోతుందని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు.
ఎక్కడ.. ఎప్పుడు..!?
మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత ఒక్కసారి మాత్రమే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో మోదీ వేదిక పంచుకున్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుండటంతో ఏపీకి రాలేకపోయిన మోదీ.. ఇప్పుడిక్కడ కూడా ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. మే-07, 08 తారీఖుల్లో మోదీ ఏపీలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 7న మధ్యాహ్నం 3:30 గంటలకు రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి తరఫున వేమగిరి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే అదే రాజు సాయంత్రం అనకాపల్లి పరిధిలోని రాజులపాలెం సభలోనూ ప్రధాని పాల్గొంటారు. ఇక మే-08న సాయంత్రం 04 గంటలకు పీలేరు సభకు మోదీ హాజరవుతారు. ఎంపీ అభ్యర్థి, మాజీసీఎం కిరణ్ కుమార్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. రాత్రి 8 గంటలకూ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు బీజేపీ రోడ్ షో నడవనుంది. ఇన్ని రోజులూ కూటమి పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విమర్శలకు చెక్ పడినట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ రాక.. కూటమికి ఫుల్ జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
ఏం మాట్లాడుతారో..?
ఆ మధ్య ప్రజాగళం సభకు వచ్చిన మోదీ.. వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ రెడ్డిని పెద్దగా విమర్శించిన దాఖలాల్లేవ్. కనీసం జగన్ అనే మాట.. మోదీ నోట రాకపోవడంతో అప్పుడు ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్కే అయ్యింది. దీంతో ఈసారైనా మోదీ.. జగన్ గురించి మాట్లాడుతారా.. లేదా..? ఒకవేళ మాట్లాడితే ఏం మాట్లాడుతారు..? ప్రధాని ప్రసంగం ఎలా ఉండబోతోంది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల.. జగన్‌ను కేంద్రంతో అరెస్ట్ చేయించే బాధ్యత తాను తీసుకుంటానని పవన్ కల్యాణ్ గట్టిగానే చెప్పారు. మరి ఈ రెండు బహిరంగ సభల్లో మోదీ సమక్షంలో మళ్లీ ఇలా చెబుతారా..? మోదీకి అర్థయ్యేలా చంద్రబాబు, పవన్ ఏం చెప్పబోతున్నారనేది కూడా ఇంట్రెస్టింగ్‌గానే మారింది. మరోవైపు.. మేనిఫెస్టో పట్టించుకోని బీజేపీ ప్రత్యేకించి ఏపీకి ఏమైనా వరాలు కురిపిస్తుందా..? అని కూడా ఏపీ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి. సారొచ్చాక.. ఏం ప్రకటిస్తారో ఏంటో చూడాలి మరి.