తమ్ముడి కోసం అన్నయ్య వచ్చేస్తున్నారహో!
పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్న సేనాని.. వైసీపీపై గెలవడానికి ఎలాంటి చిన్న అవకాశం దొరికినా ఆలస్యం చేయకుండా దూకేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం అసెంబ్లీ కాదు కదా.. గేటు కూడా తాకనివ్వమని చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో తమ్ముడు పవన్‌కు తనవంతుగా సాయం చేయడానికి అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం వచ్చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సరిగ్గా పోలింగ్‌కు మూడ్రోజుల ముందు అంటే.. మే-10న పవన్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక అదేరోజు బాబాయ్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలిసింది.
వస్తున్నా.. వచ్చేస్తున్నా!
సినిమాల్లో అందరివాడు అనిపించుకున్న చిరు.. రాజకీయాల్లో రాణించినప్పటికీ కొన్ని దుష్టశక్తులను ఎదుర్కొలేక, పాలిట్రిక్స్ ఎరుగక తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేశారు. నాటి నుంచి వరకూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మెగాస్టార్.. ఈసారి ఎందుకో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమ్ముడికి 5 కోట్ల రూపాయిలు చెక్ ఇవ్వడం మొదలుకుని నిన్న, మొన్న సీఎం రమేష్ కలయిక వరకూ ప్రతిదీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్కే అయ్యింది. ఇక జరిగిందేదో జరిగింది కదా అని గ్రౌండ్‌లోకి దిగిపోతున్నారు చిరు. ఓ వైపు తమ్ముడిపై ఇష్టానుసారం విమర్శలు.. మరోవైపు మెగా ఫ్యామిలీని కలిపి మరీ వైసీపీ, అధికార పార్టీ అనుకూల చానెల్స్ పైత్యం ప్రదర్శిస్తున్న వేళ.. చిరు పిఠాపురం విచ్చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంతో పాటు.. ఏపీ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏం మాట్లాడుతారో..?
చిరు వస్తారు సరే.. ఏం మాట్లాడుతారు..? విమర్శకులకు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు..? అనేది ఇప్పుడు సినీ, రాజకీయ రంగాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. మరీ ముఖ్యంగా అన్నయ్యతో సీఎం జగన్ చేతులు కట్టుకునే పరిస్థితి తెచ్చారని పవన్ పదే పదే ఈ మధ్య విమర్శిస్తున్నారు. దీనిపై చిరు ఏం మాట్లాడుతారనేది కూడా ఉత్కంఠంగానే ఉంది. ఇక అన్న సమక్షంలో తమ్ముడు.. సోదరుడి సమక్షంలో చిరు ఏం మాట్లాడబోతున్నారని జనసేన శ్రేణులు, మెగాభిమానులు వేయికళ్లతో ఎదురుచూపుల్లో ఉన్నారు. అయితే.. చిరు ప్రచారానికి రాలేని పక్షంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పిఠాపురం ఓటర్లకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక.. తమ్ముడి గెలుపులో అన్నయ్య పాత్ర ఏ మాత్రం ఉంటుందో.. చిరు సాయం ఎంతవరకు వర్కవుట్ అవుతోందో జూన్-04 చూసేద్దాం మరి.