విజనరీ బాబు కోసం తలైవా వీడియో
సూపర్ స్టార్ రజనీకాంత్.. ఏపీలో సందర్భం వచ్చినప్పుడల్లా సరే ఈ పేరు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.! నాడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు విచ్చేసిన తలైవా.. కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం, టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ప్రశంసల జల్లుపై వైసీపీ ఎంత పైత్యం ప్రదర్శించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఏకంగా మంత్రులు, వైసీపీ కీలక నేతలు సైతం మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం కాస్త వైసీపీ వర్సెస్ సూపర్ స్టార్ అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. అయితే సరిగ్గా ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి చంద్రబాబు గురించి రజనీకాంత్ మాట్లాడబోతున్నారు.
ఆల్ ది బెస్ట్ బాబూ..!
నాడు ఎన్టీఆర్.. నేడు నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీతో రజనీకాంత్ మంచి సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తున్నారు. అందుకే ఈ రెండు కుటుంబాల నుంచి కబురొస్తే చాలు నిమిషాల్లో వాలిపోతుంటారు. ముఖ్యంగా చంద్రబాబు విజనరీ అంటే బాస్‌కు బాగా ఇష్టం.. అందుకే సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా తెగ పొగిడేస్తుంటారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరుగుతుండటంతో బాబు కోసం రజనీ రంగంలోకి దిగబోతున్నారు. అదెలాగంటే.. రాష్ట్ర ప్రజల కోసం ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. బాబుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ఆయన హయాంలో చేసిన అభివృద్ధి, విజనరీ గురించి వీడియోలో వివరించబోతున్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో వీడియో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
గట్టి దెబ్బే పడనుందా..?
ఈ వీడియో దెబ్బకు వైసీపీకి జరగాల్సిన నష్టమే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎలాగంటే.. అప్పట్లో వైసీపీ కార్యకర్తలు, నేతలు.. అవమానించి మాట్లాడటంతో గట్టిగానే దెబ్బపడింది. ఆ తర్వాత గట్టిగానే ఆడియో ఫంక్షన్లో ఆయన మళ్ళీ స్పందించారు. ఈ లోకంలో మొరగని కుక్క ఉండదు... విమర్శించని నోరు ఉండదు... ఇవి రెండూ జరగని ఊరు ఉండదు.. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలి.. అర్థమైందా రాజా! అంటూ ఆయన పేల్చిన డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఏకంగా వీడియో రిలీజ్ చేయనుండటంతో నాడు, నేడు రెండూ అధికార వైసీపీపై ప్రభావం చూపించే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే.. రజనీ వీడియో రిలీజ్ చేశాక.. కచ్చితంగా వైసీపీ మళ్లీ తన నోటికి బుద్ధి చెబుతుంది.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. దీంతో మరోసారి రజనీ టార్గెట్ కావడం, బాబుకు ప్లస్ కావడం ఇన్నీ చకచకా జరిగిపోతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. వీడియోలో ఇంకా ఏమేం ఉంటాయో.. ఎవరికి ప్లస్ అవుతాయి..? ఇంకెవరికి మైనస్ అవుతాయన్నది తెలియాలంటే రిలీజ్ ఎప్పుడో చూడాలి మరి.