ఏపీ ఎన్నికలపై కేటీఆర్ జోస్యం.. చూశారా!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఓ వైపు సర్వేలు.. మరోవైపు పార్టీలు ఊహల్లో తేలిపోతున్నాయ్!. ఎన్నికల ముందే గెలిచేశామని అధికార పార్టీ.. అబ్బే ప్రమాణ స్వీకారం మాత్రమే తరువాయి కూటమి పార్టీలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక మీడియాలో, సోషల్ మీడియాలో అంటారా అబ్బో.. ఎవరికి తోచినట్లుగా వారు తెగ రాసేసుకుంటున్నారు. ఇక తెలంగాణకు సంబంధించిన కొందరు కీలక నేతలు అయితే ఏపీ ఎన్నికలపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ కీలక నేతల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య ఏపీ ఎన్నికలపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఏపీ ఎన్నికలపై మాట్లాడి.. హాట్ టాపిక్ అయ్యారు.
ఇంతకీ ఏం మాట్లాడారు..?
ఏపీలో పాలిటిక్స్ చూస్తున్నారు కదా..? ఏపీలో ఏం జరగబోతోంది..? మీ దగ్గరున్న సమాచారమేంటి..? అనే ప్రశ్న కేటీఆర్‌కు ఇంటర్వ్యూలో ఎదురైంది. దీనికి స్పందించిన మాజీ మంత్రి.. ఏపీలో మళ్లీ వైస్ జగన్ మోహన్ రెడ్డే సీఎం అవుతారని ఒక్క మాటలో చెప్పేశారు. ఏపీలో తాను చదువుకున్నానని.. అక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారన్నారు. అంతేకాకుండా సీమాంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వాళ్లు కూడా చాలామందే ఉన్నారని.. వారితో మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని తెలుస్తోందని కేటీఆర్ జోస్యం చెప్పారు. తన దగ్గరున్న సమాచారం మేరకు అయితే మళ్లీ జగనే సీఎం అవుతారని మరోసారి చెప్పారు కేటీఆర్. మాజీ మంత్రి మాట ఎంతవరకు నిజమవుతుందో చూడాలి మరి.
సోషల్ మీడియాలో గట్టిగానే!
కేటీఆర్ మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక.. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు.. తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులు ఓ రేంజ్‌లో కేటీఆర్‌ను విమర్శిస్తున్నాయి. ముందు ఇక్కడ జరగబోయే ఎన్నికల సంగతి చూడు.. తర్వాత ఏపీ గురించి మాట్లాడు అని కొందరు సలహాలు ఇస్తున్నారు. మరికొందరు అయితే.. కేటీఆర్ చిలక జోస్యం చెప్పడం ఎప్పట్నుంచి షురూ చేశారబ్బా..? అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కేటీఆర్ కామెంట్స్ హాట్ టాపిక్‌గానే మారాయి. ఈ మధ్యనే కేసీఆర్ కూడా.. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ లాగే.. జగనే మళ్లీ సీఎం అని తనకు పక్కా సమాచారం ఉందని చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడి నోట ఒకే మాట రావడంతో వైసీపీ శ్రేణులు హ్యాపీగా ఫీలవుతుండగా.. లెక్కలేనన్ని తిట్లు మాత్రం విమర్శకుల నుంచి వస్తున్న పరిస్థితి.