టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇరకాటంలోకి నెట్టేశారా..? అసలేం చేయాలో దిక్కుతోచని స్థితిలో బాబు ఉన్నారా..? ఆలస్యం చేసి అనవసరంగా తప్పుచేశామని తెగ ఫీలవుతున్నారా..? అంటే తాజాగా కూటమి కుటుంబంలో నడుస్తున్న చర్చతో ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. శనివారం నాడు (ఏప్రిల్-27న) వైసీపీ మేనిఫెస్టోను జగన్ రెడ్డి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో కూటమి కూసాలు కదిలిపోతున్నాయట. ఎందుకంటే.. మేనిఫెస్టోలో అలివిగాని హామీలు ప్రకటించలేదు..? ఆడంభరాలకు పోలేదు.. అంతకుమించి జనాలను నమ్మించి వారి మెప్పులు పొందడానికి మరేమీ ప్రకటించలేదు. ఎంతసేపూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలను.. 2024లో నవరత్నాలు 2.0 మాత్రమే చేసి చెప్పారు. ఇక గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పథకాలు కొన్ని కొనసాగింపుగానే ఉన్నాయి. ఇక అమ్మఒడి, రైతు భరోసా, కాపు నేస్తం, చేయూతతో పాటు పలు పథకాలకు నగదు పెంచడం జరిగింది. ఇంతే ఇంతకుమించి ఎక్కడా హడావుడి లేదు.. అంతకుమించి జరగని హామీలు అస్సలు ఇవ్వలేదు. జగన్ చెప్పాల్సింది చెప్పేశారు.. ఇక మన పరిస్థితేంటని కూటమి అగ్రనేతలు ఆలోచనలో పడ్డారట.
ఏం చేద్దాం.. బాబు!
వైఎస్ జగన్ ఎప్పుడూ దేవుడు, ప్రజలనే నమ్ముతానని చెబుతుంటారు. చెప్పిందే చేస్తారు.. చేయగలిగిందే చెబుతారు.. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఇచ్చిన మాట కోసం హామీలు అమలు చేసి తీరతారని ఒక నమ్మకం, భరోసా ఈ ఐదేళ్లలో బాగానే ఉండిపోయింది. దీంతో ఈసారి కూడా జగన్ ఎలాంటి చిత్రవిచిత్ర హామీలు ఇవ్వకుండా సాఫీగానే మేనిఫెస్టో ప్రకటించేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇదే. అవును.. జగన్ మాటిస్తే తప్పడు.. మాట తప్పేది, మడమ తిప్పేది వైఎస్ వంశంలోనే లేదనే చెప్పుకుంటున్న పరిస్థితి. దీంతో ఇప్పుడేం చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..? ఎలాంటి హామీలు ఇస్తే జగన్‌ను ఓడించొచ్చు..? అనే వ్యూహ రచనలో ఉన్నాడట చంద్రబాబు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ హామీలను కాపీ కొట్టేసి ఆహా, ఓహో అంటూ జనాల్లోకి తెగ వెళ్లిపోయారు. రేపొద్దున ఇవి మేనిఫెస్టోలో ఉంటాయా లేదా అన్నది ప్రశ్నార్థకమేనట. పోనీ జగన్ టచ్ చేయని రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చెబుదామా..? అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ లీడర్లతో అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందనేది అర్థమయ్యే ఉంటుంది కదూ..!
అయ్యే పనేనా బాబూ..!
వాస్తవానికి ఇప్పుడు జనాలంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా..? అని ఎదురుచూస్తున్న పరిస్థితి. జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు గనుక ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. అంతేకాదండోయ్.. సూపర్ సిక్స్‌లో కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అచ్చుగుద్దినట్లుగా దింపేసిన చంద్రబాబు.. రేపొద్దున్న జగన్ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఉన్నవి కాపీ కొట్టినా పెద్దగా అవాక్కవ్వాల్సిన పనిలేదేమో అని సొంత పార్టీ నేతలు, కూటమి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. అయితే.. జగన్ టచ్ చేయని హామీలను చంద్రబాబు టచ్ చేస్తే పరిస్థితేంటి..? పోనీ అందరూ అనుకుంటున్నట్లుగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ప్రకటిస్తే సాధ్యమయ్యే పనేనా..? అనేది కూడా ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ అటుంచింతే రాష్ట్ర ఆదాయం రూ. 84,389 కోట్లు కాగా.. జగన్ ప్రకటించిన పథకాలకు 77,000 కోట్లు అవుతుంది. అయితే ఇప్పటి వరకూ చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్‌కే రూ. 1,21,0000 కోట్లు అవుతుంది. అంటే.. ఆదాయం కంటే ఎక్కువే అది కూడా ఒకటి రెండు కాదు 45 వేల కోట్లు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు చంద్రబాబు హామీలు నెరవేరుస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
నమ్మకం.. నమ్మకద్రోహం!
ఇవన్నీ అటుంచితే.. చంద్రబాబు 2014లో గెలిచి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంతవరకూ నెరవేర్చారు..? జగన్ సీఎం అయ్యాక 2019 నుంచి ఇప్పటి వరకూ ఎన్ని హామీలు నెరవేర్చారు..? వైఎస్ జగన్ ఒక్కసారి మాటిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..? అనేది ప్రజలు బేరీజు చేసుకుంటున్న పరిస్థితి. 2024 మేనిఫెస్టో ప్రకటిస్తే కచ్చితంగా అమలు చేయలేని హామీలే ఉంటాయ్.. మరి ఇవన్నీ నెరవేరుస్తారని ఎలా నమ్ముతామని ప్రజలు ఆలోచిస్తున్నారు. లెక్కలేసి మరీ మేనిఫెస్టో ప్రకటించిన జగన్.. చంద్రబాబును గట్టిగానే తేరుకోకుండానే ఇరికించేశారనే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఇవే చర్చించుకుంటున్నారు. దీంతో జగన్ అంటే నమ్మకం అని కొన్ని వర్గాల ప్రజలు అంటుంటే.. అబ్బే ఐదేళ్లలో చేసిందేమీ లేదని టీడీపీ భక్తులు చెప్పుకుంటున్నారు. ఇక చంద్రబాబు అంటేనే దగా, కుట్ర, మోసం.. నమ్మక ద్రోహం అని ప్రజల నుంచి గట్టిగానే టాక్ వస్తోంది. దీంతో నమ్మకం-నమ్మకద్రోహం మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలిచి నిలిచేదెవరన్నది మరికొన్నిరోజుల్లో తేలిపోనుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.