వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలు- 2024కు మేనిఫెస్టో ప్రకటించేశారు. చేయగలిగినవి మాత్రమే చెప్పాను.. చేసి చూపిస్తాను.. హీరో అనిపించుకుంటాను అని మేనిఫెస్టో ప్రకటనలో పదే పదే జగన్ చెప్పారు. మేనిఫెస్టో అనేది భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిది అని కూడా చెప్పేశారు. మునుపటితో పోలిస్తే.. ఈ మేనిఫెస్టో అదిరిపోయిందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. ఈ మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు..? అసలు ఏపీలో ఏం నడుస్తోంది..? రైతులు, పెన్షన్ తీసుకునే పేదలు, వృద్ధులు.. వితంతువులు ఏమనుకుంటున్నారు..? ఇక అమ్మఒడి తీసుకున్న తల్లులు ఎలా రియాక్ట్ అవుతున్నారు..? నిరుద్యోగులు ఎలా స్పందిస్తున్నారు..? సొంత పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఫిర్యాదులు ఏంటి..? సోషల్ మీడియాలో చర్చేంటనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.
జనం ఏమనుకుంటున్నారు..?
జగన్ మేనిఫెస్టో ఫలానా రోజు ప్రకటిస్తారనే చెప్పిన నాటి నుంచి.. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఏప్రిల్-27 రానే వచ్చింది.. శనివారం నాడు సరిగ్గా 11:00 గంటలకు మేనిఫెస్టో షురూ చేసిన జగన్ సుమారు రెండు గంటలకుపైగానే ఇప్పటి వరకూ ఏం చేశాం.. ఏం చేయబోతున్నాం అనేది ఒక్కో అంశాన్ని వివరించారు. ఇలా జగన్ ప్రకటన వచ్చినంత సేపూ జనాలు టీవీలు, యూట్యూబ్‌లకు అతుక్కుపోయారు. ఎలాగో ప్రకటన వచ్చేసింది.. నవరత్నాలు కొనసాగింపుతో పాటు.. ప్రతిదానిపైనా పెంపుదల జరిగింది. దీంతో జగన్ సర్కార్ నుంచి ఇప్పటి వరకూ అమ్మఒడి అందుకున్న తల్లులు ఈసారి ఎంత పెంచారని..? రైతు భరోసా తీసుకుంటున్న రైతన్నలు ఈసారి ఏం చెప్పారని..? పెన్షన్ తీసుకుంటున్న పెద్దమ్మలు ఈసారి ఎంతిస్తారని చర్చించుకుంటున్న పరిస్థితి. అమ్మ ఒడి పెంపుతో తల్లులు.. పెన్షన్ల పెంపుతో వితంతువులు, వృద్ధులు, వికలాంగులు చిరునవ్వు చిందిస్తున్న పరిస్థితి. ఇక రైతులు అయితే.. రుణమాఫీ ఉంటుందని ఎంతో ఆశపెట్టుకున్నారు కానీ.. రైతు భరోసా పెంపు, పైగా కౌలు రైతులకు కూడా వర్తింపు అనడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. దీంతోపాటు సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం తీసుకునే వెసులుబాటు ఇవ్వడం మంచిదేనని జనాలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక డ్వాకా రుణమాఫీ ఉంటుందని మహిళలు అయితే కాసింత అసంతృప్తిగానే ఉన్నా.. చేయూత కింద నగదు పెంచడం కాసింత ఊరటనిచ్చే విషయం. ఇలా ఎవరికి తోచినట్లుగా ఆయా వర్గాలు ఉన్నాయి. ఇక నిరుద్యోగులు అయితే.. ప్రతీ నియోజకవర్గంలో స్కిల్ హబ్, జిల్లాకో స్కిల్‌డెవలప్‌మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ అని జగన్ ప్రకటించడంతో చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇది నిజంగా నిరుద్యోగులకు ఒక వరం లాంటిదేనని.. మునుపెన్నడూ ఇలాంటి ప్రయత్నాలు ఏ సర్కారూ చేయలేదని చెప్పుకుంటున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు.. ఇప్పటి వరకూ జగన్ చెప్పినవన్నీ చేశారనే నమ్మకం ప్రజల్లో గట్టిగానే ఉంది. అదే నమ్మకంతో ఇప్పుడు కూడా ఉన్నామని.. ఇక్కడ నమ్మకం, విశ్వసనీయత అనేది పనిచేస్తుందని ఆయా వర్గాలు చెబుతున్న పరిస్థితి. ఇప్పుడంతా ఏ ఇద్దరు కూర్చున్నా మేనిఫెస్టోపైనే చర్చించుకుంటున్నారు. మౌత్ పబ్లిసిటీ అనేది ఎలా పనిచేస్తుందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
కేడర్ కోరుకున్నదేంటి..?
వాస్తవానికి చాలా రోజులుగా జగన్ ఏం ప్రకటించబోతున్నారనే దానిపై వైసీపీ శ్రేణుల్లో చాలా ఉత్కంఠే నెలకొంది. ఎందుకంటే.. ప్రత్యర్థి కూటమి ఎలాంటి హామీలు ఇస్తుందన్నది ముందే పసిగట్టిన వైసీపీ కార్యకర్తలు ఈసారి కచ్చితంగా రైతు రుణమాఫీ, డ్వాకా రుణమాఫీతో పాటు కచ్చితంగా కొన్ని కీలక ప్రకటనలు ఉంటాయని భావించినప్పటికీ ఆ ఊసే లేదు. దీంతో కేడర్ కాసింత నిరాశపడినప్పటికీ జగన్ చేసేవి మాత్రమే చెబుతారని.. చెప్పిన తర్వాత అమలు చేయకుండా అస్సలు ఉండరని చెబుతున్న పరిస్థితి. రుణమాఫీ బదులుగా రైతు భరోసా పెంచడం మంచి పరిణామమే అని.. ఇక చేయూత కూడా మహిళలకు మంచి చేకూర్చేదేనని చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక అది లేదు.. ఇది లేదు అనే మాటలు లేకుండా, అనకుండా చెప్పిన మేనిఫెస్టోను గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయడమే మన పనని కార్యకర్తలు ఒకరికి ఒకరు నచ్చజెప్పుకుంటున్న పరిస్థితి అయితే సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు.. పథకాలకు డబ్బులేం ఊరికే రావు.. అవేం పప్పు, బెల్లాలు కాదు పంచి పెట్టడానికి అని మరికొందరు కార్యకర్తలు, వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక.. జగన్ అయితే 10 రూపాయలు ఇస్తే తక్కువ ఇచ్చినా చెప్పిందే చేస్తాడని.. అదే చంద్రబాబు 10 రూపాయలు ఎక్కువే చెప్పి పావలా కూడా ఇవ్వడనే అభిప్రాయంలో ఇంకొందరు ఉండటం.. ఈ విషయాలన్నీ జనాల్లోకి తీసుకెళ్లాలని అనే మాటపై ఉన్నారు. ఇప్పటి వరకూ అంతా ఓకేగానీ.. కూటమి మేనిఫెస్టో ప్రకటన వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.