ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు-2024 అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి డూ ఆర్ డై గా మారాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..! ఎందుకంటే.. వైఎస్ జగన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయితే మాత్రం ఇప్పుడు అంతంత మాత్రమే ఉన్న టీడీపీ పరిస్థితి ప్రశ్నార్థకమే. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ రెడ్డికి ముప్పు తిప్పలు తప్పవు.. ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన ఆ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం, రఘురామరాజును జైలుకు పంపి కొట్టించడం.. ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ఉన్నాయి. ఇంత జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటాడన్నది అస్సలు జరిగే పనేకాదు. అందుకే.. గత రెండు, మూడు నెలలుగా అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరూ జనాల్లోనే ఉన్నారు. జగన్ సింగిల్‌గానే వస్తుండగా.. చంద్రబాబు మాత్రం యథవిధిగా కూటమితో (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎన్నికలకు వచ్చేశారు. అభ్యర్థుల ప్రకటన, సిద్ధం, మేమంతా సిద్ధం.. భారీ బహిరంగ సభలతో జనసంద్రంలోనే ఉన్న వైఎస్ జగన్.. ఇప్పుడు మరో జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో ఒకరు కాదు ముగ్గురున్నప్పటికీ కూటమి పెద్దలు వెనకబడ్డారనే చెప్పుకోవాలి.
నమ్మకం.. నమ్మకం..!
2014 ఎన్నికల్లో అలివిగాని హామీలు ఇచ్చిన టీడీపీ నెరవేర్చలేక చేతులెత్తేసి.. ఆఖరికి మేనిఫెస్టోనే మాయం చేసిన దుస్థితి. విభజిత ఆంధ్రప్రదేశ్, పైగా అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తే రాజధానితో ఏదో చేస్తారని ఆశపడిన జనాలు గంపగుత్తగా ఓట్లేసేశారు. అయినప్పటికీ నాటి ప్రతిపక్షమైన వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కోని పాలన సాగించారు బాబు. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. 23 మంది లాక్కున్న చంద్రబాబుకు చివరికి అదే గతయ్యింది. ఎందుకు.. ఏంటనేది ఇక్కడ అప్రస్తుతం. నాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని నేను విన్నాను.. నేనున్నాను.. రావాలి జగన్ కావాలి జగన్ అంటూ నినదించారు. నవరత్నాలు అంటూ హామీలిచ్చిన జగన్‌కు కనివినీ ఎరుగని రీతిలో.. చరిత్రలో మునుపెన్నడూ లేని మెజార్టీగా 175 సీట్లకు గాను 151 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో 22 గెలుచుకోని ఫ్యాన్ సునామీ సృష్టించారు. నాటి నుంచి నేడు మళ్లీ 2024 ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసినంత వరకూ పాలన ఎలా సాగింది..? ఆయనిచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేర్చారు..? జగన్ నిజంగానే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుండా జనాలను మోసం చేశారా..? లేకుంటే చెప్పిన వాటికంటే ఎక్కువే నెరవేర్చారా..? అన్నది ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు నవరత్నాలు 2.0ను రిలీజ్ చేసిన జగన్.. మునుపటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు, అంతకుమించి చేర్పులు చేయడం జరిగింది. అయితే.. తాను చెప్పిందే చేస్తారని.. చేసేదే చెబుతారన్నది ప్రజల విశ్వాసం. ఎందుకంత నమ్మకం అనేది 2019 ఎన్నికల్లో అంతా చూశారు.. ఇప్పుడు కూడా జగన్ అదే నమ్మకంతోనే అలివిగాని హామీలు ఇవ్వకుండా.. ఆఖరికి సొంత పార్టీ నేతలు కొట్లాడినా సరే చేసేదే చెబుతానని మేనిఫెస్టోను ప్రకటించారు.
చంద్రబాబు పరిస్థితేంటి..?
ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ జనాల్లో తెగ తిరిగేస్తున్న టీడీపీ.. ఇప్పటి వరకూ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించలేదు. వైఎస్ జగన్ రిలీజ్ చేశారు గనుక ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాస్తవానికి సూపర్ సిక్స్‌లో కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఉన్నాయన్నది జగమెరిగిన సత్యమే. ఇది మినీ మేనిఫెస్టో అయినప్పటికీ రేపటి రోజున ఇంతకుమించి ప్రకటించడానికి బహుశా ఏమీ ఉండకపోవచ్చు. పైగా చంద్రబాబు ఒక్కరే నిర్ణయం తీసుకోవడానికి లేదు.. ఏమున్నా హైదరాబాద్‌లో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీలో ఉన్న బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా అనుమతి కావాల్సిందే. దీంతో ఇష్టానుసారం స్వతంత్రంగా హామీలు ఇవ్వడానికీ లేదు.. అసలు అంతటి సాహసం చేయడానికీ లేదు. పైగా.. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చంద్రబాబు ఏ మాత్రం అమలు చేశారన్నది ప్రజలకు బాగా తెలుసు.. ఇప్పుడిదే టీడీపీకి ఉన్న అతి పెద్ద మైనస్.. వైసీపీకి మాత్రం అంతకుమించి ప్లస్ అయ్యేది ఇదే.!. ఇప్పుడున్న కూటమిలోని పార్టీలే జనసేన, బీజేపీలే టీడీపీతో జతకట్టాయి.. అన్ని పార్టీలు కలిసి కూడా హామీలు నెరవేర్చలేకపోయాయి. ఇప్పుడు కూడా అవే పార్టీలు కలిసి కట్టుగా ఎన్నికలు వచ్చేశాయి. సూపర్ సిక్స్‌తో జనాల్లోకి వెళ్లిన చంద్రబాబుకు ఏ మాత్రం ఆదరణ వచ్చిందనేది అందరికీ తెలిసిందే. నాటి పరిస్థితే నేడు కూడా చంద్రబాబుకు ఎదురవుతోంది. మేనిఫెస్టో ప్రకటన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలుస్తుంది. పైగా.. చంద్రబాబు మాటిచ్చినా, హామీలిచ్చినా.. అదే జగన్ హామీలిచ్చి, మాటిస్తే ఎలా ఉంటుందనే దానిపైనే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు బేరీజు చేసుకుంటున్న పరిస్థితి. 2019లో ఇచ్చిన హామీలన్నీ క్లియర్ కట్‌గా నెరవేర్చడంతో.. ఇప్పుడు జగన్‌పైన కూడా విశ్వాసం, అంతకుమించి జనాల్లో భరోసా బాగానే కలిగింది. దీంతో 2019 సీన్ రిపీట్ అయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు, మేధావులు చెబుతున్న పరిస్థితి. ఏం జరుగుతుందో జూన్ 04న తేలిపోనుంది మరి.