అతడొక మంత్ర విద్యల ఉద్యానవనంలా నడిచొస్తాడు. అన్ని ఋతువుల్లోనూ కవిత్వ సుగంధంలా ప్రవహిస్తూంటాడు. అతను నాల్గు దిక్కులా పుస్తకాలతో అల్లుకుంటాడు. అతడు అడుగులేస్తున్నప్పుడు వెనుకనే ఆలయ సంగీత సౌందర్యాల నీడలు వస్తూంటాయి. ఆధునిక జీవితానికి ఆధ్యాత్మిక శాంతినిచ్చే ఆనందోద్వేగాల అనుభూతి అతడు. ఆరణ్యక సౌందర్యంలో వెన్నెల్లాంటి అతని పుస్తకాలు కుల విభజన రేఖలకు అతీతంగా దేవుణ్ణి ప్రేమించేలా చేస్తాయి... పుస్తక మాంత్రికుడు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ గురించి పదేళ్ల నాడు హైదరాబాద్ త్యాగరాయగానసభలో జ్ఞానపీఠపురస్కార గ్రహీత, విఖ్యాత కవి ఆచార్య సి. నారాయణరెడ్డి (Dr C Narayana Reddy) అచ్చమైన స్వచ్ఛమైన పలుకులు నిజం కాబట్టే ఈనాటికీ పురాణపండ అద్భుతాలు ఇటు సినీ ఇండస్ట్రీ, అటు పొలిటికల్ ఫీల్డ్ వరకూ మెరుస్తూనే ఉన్నాయి.
పదిహేనేళ్ల నాడు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) కలం నుండి జాలువారిన అపూర్వ భక్తి మాధుర్య సంచిక జయం జయం బుక్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా వందలమంది మనసుల్ని తాకి పూజాపీఠాల ముందుకి చేరి... ఎందరో సినీ ప్రముఖులచే మళ్ళీ మళ్ళీ ముద్రించబడి జంటనగరాల్లో వందల ఆలయాలకు చేరడాన్ని అప్పుడప్పుడు పవిత్ర వేడుకలకు కలిసే సినీ ప్రముఖులు గుర్తుచేసుకోవడం విశేషమేమరి.
అంతే కాదు... పురాణపండ శ్రీనివాస్ అద్భుతమైన హనుమంతుని చిత్ర తేజస్సుతో ఈ బుక్‌కి జయం జయం (Jayam Jayam)గా పేరు పెట్టడంతో సినీ ప్రముఖుల్లో కొందరికి సెంటిమెంట్‌గా మారడం, కారులో ప్రయాణం చేసే వేళల్లో కూడా ఈ జయం జయం అపురూప గ్రంధాన్ని తెచ్చుకునేవారని ఇటీవల మాజీ పార్లమెంట్ సభ్యుడు, జయభేరి అధినేత, విఖ్యాత నటుడు మురళీమోహన్ ఒక సాంస్కృతిక సభలో చెప్పారు కూడా.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బ్లడ్ బ్యాంకు ప్రారంభ ముహూర్తంలో అయ్యవార్లు ఈ జయం జయం దివ్య గ్రంధంలోని కొన్ని పవిత్ర అంశాలు శ్రావ్యంగా చదవడం కూడా మెగా ఫ్యామిలీకి ఎరుకే.
వేల వేల పుస్తకాలతో జయం జయం కొన్ని తెలుగు వాకిళ్ళను పలకరించినా ఇప్పుడు మళ్ళీ క్రొత్త విశేషాలతో కేవలం సినిమా రంగానికే ఉచితంగా ఇవ్వడానికి జయం జయం పుస్తకం జూబిలీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మణికొండల అంతటా సంప్రదాయాలతో విస్తరించబోతోంది. సినీ సమూహాలకోసం విఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం వేదాత్మకమైన భగవత్సందేశాన్ని మోసుకొస్తోంది.
గతంలో విఖ్యాత సినీ నిర్మాతలు చలసాని అశ్వనీదత్, సాయి కొర్రపాటి, దిల్ రాజు, వివేక్ కూచిభట్ల వంటి ప్రముఖులు పురాణపండ శ్రీనివాస్‌తో అందింపచేసిన అపురూప గ్రంధాలు ఇప్పటికే సినీ రంగంలో ఎందరికో చేరి వైదిక విలువల సంతోషాన్ని వర్షించాయనేది స్ఫుటమైన సత్యం.
దర్శకరత్న దాసరి (Dasari Narayana Rao) ఎంతో ఇష్టపడే దైవీయ చైతన్యాల వ్యక్తి పురాణపండ శ్రీనివాస్ అని చాలా మంది ప్రముఖులకు తెలుసు. రచనా సంకలన గ్రంధాల వైభవంలో సిద్ధహస్తుడు శ్రీనివాస్ అని ఇంకా ఎంతోమందికి తెలుసు.
అంతరాత్మలో పరమాత్మను వెతికే అన్వేషణల మంత్రవనమాలి పురాణపండ శ్రీనివాస్ జయం జయం గ్రంధాన్ని తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన మరొక విఖ్యాత నిర్మాత సమర్పిస్తున్నట్లు ఫిలింనగర్ సమాచారం.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ద్వారా గతంలో దిల్ రాజు ఆఫీస్ మేనేజర్ శేషగిరిరావు ఎంతో సంస్కారంతో చాలామందికి పురాణపండ బుక్స్‌ని అందించినట్లు మా ఆఫీస్ సిబ్బంది ఇప్పటికీ చెబుతారు. అంతే కాదు... సాయి కొర్రపాటి సుమారు మూడు భారీ గ్రంధాలను వందలకొలది ప్రతులను మా కార్యాలయానికి తమ సిబ్బందితో చేరవేసి ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ పెద్దలకు అందజేసేవారు. మళ్ళీ సుమారు కొన్నేళ్ల తర్వాత ఒక స్పష్టమైన ఆధ్యాత్మిక సాధనాగ్రంధం పురాణపండ శ్రీనివాస్ సినీ పరిశ్రమకు త్వరలో అందజేయబోవడం దైవానుగ్రమే అంటున్నారు కొందరు సినీ పరిశీలకులు.