అవును.. ఏపీలో కూటమి గెలవడం కష్టమే..! టీడీపీ, బీజేపీ, జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది..! ఈ మాటలు ఎవరో అనలేదండోయ్.. నరసారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఈయనకు బాగానే తెలిసొచ్చింది అనుకుంటా.. అందుకే టీడీపీ దుస్థితిని బట్టబయలు చేశారు. ప్రాంతీయ మీడియా అంటే అబ్బే అదంతా అబద్ధం, వక్రీకరించారు అనుకోవచ్చు.. జాతీయ మీడియా కావడంతో అసలేం జరుగుతోంది..? గెలుపు కోసం అగ్రనేతలు కాలికి బలపం కట్టుకుని తిరుగుతుంటే లావు ఇలా మాట్లాడటం ఏంటి అని కూటమి నేతలు కన్నెర చేస్తున్న పరిస్థితి. ఇంతకీ ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు..? ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది..? అనేది లావు మాటల్లోనే విందాం రండి..!
జరిగింది ఇదీ..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియని పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ రెండోసారి అధికారంలోకి రాకూడదని కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకొని ముందుకెళ్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే ఎంపీ అభ్యర్థి లావు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో కూటమి కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఏపీలో టీడీపీ గెలవాలంటే చాలా కష్టపడాలని.. ఎన్డీయే కూటమిలో కలిసినా అంతగా మేలు ఏం జరిగే అవకాశం లేదన్నారు. చూశారు కదా.. కూటమి గెలుపు కష్టమని చెప్పకనే చెప్పారు అన్న మాట. ఈ మాటలు విన్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి, ఆందోళనకు గురవుతున్నాయి.
యో.. ఏందిదీ..!!
వైసీపీ తరపున నరసారావుపేట నుంచి మాజీ మంత్రి,ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఈయన సొంత జిల్లా నెల్లూరును వదిలేసి గుంటూరు జిల్లాకు వచ్చారు. ఇందుకు ఓకే ఒక్క కారణం పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆజ్ఞ అంతే.! ముందు ఏదో అనుకున్నా అనిల్ కు వస్తున్న ఆదరణ అబ్బో మామూలుగా లేదు. దీంతో ఎన్నికల ముందే అనిల్ గెలిచేశాడని ఆపార్టీ నేతలు, అభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి. అలాంటిది సిట్టింగ్ సీటు, సొంత జిల్లా మనిషివి ఎంత ధీమాగా ఉండాల్సింది.. కానీ ఇదొక్కటే లావు దగ్గర లేదన్న విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పేశారు.. పనిలో పనిగా కూటమి కష్టమే అని కూడా చెప్పి రచ్చ రచ్చే చేశారు. ఇప్పుడిదే ఎక్కడ చూసినా చర్చ.. టీడీపీలో ఐతే పెద్ద రచ్చే జరుగుతోంది. చూడాలి మరి మున్ముందు ఇంకా ఏమేం జరుగుతుందో.!!