ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఓ వైపు సూర్యుడు ఎండ రూపంలో తన ప్రతాపం చూపిస్తుండగా.. రాజకీయ నేతల మాటల, తూటాలతో ఏపీ మరింత హీటెక్కిపోతోంది. జగన్‌ను విమర్శించడంలో, ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపడంలో.. ఎలా కావాలంటే అలా తిట్టిపోయడంలో అన్నింటిలోనూ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) సక్సెస్ అవుతూ వస్తోంది కానీ.. ఒక్క విషయంలో మాత్రం జగన్ ఢీ కొట్టలేకపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ దరిదాపుల్లోనికి కూడా వెళ్లలేకపోతోంది. విచిత్రమేమిటంటే కూటమిలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, దేశానికి ఎంతో మంది ప్రధానులు, రాష్ట్రపతులను సైతం అందించానని.. తనకే ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా త్యాగం చేశానని చెప్పుకునే నారా చంద్రబాబు.. జగన్ ఎత్తులు, వ్యూహాల ముందు తేలిపోతున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యమక్కర్లేదేమో. ఎందుకంటే.. తన రాజకీయ చాణక్యం ఏమైంది..? పైకి బచ్చా బచ్చా అని జగన్‌ను తిట్టిపోసే బాబు ఆయన్ను బీట్ చేయలేకపోవడం.. కనీసం టచ్ చేయడానికి కూడా సాహసించలేక డీలా పడిపోతున్నారనే చర్చలు గట్టిగానే నడుస్తున్నాయి.
ఇదీ అసలు సంగతి!
2019 ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో 151 సీట్లను సంపాదించుకొని జగన్మోహనుడి విజయం, ఫ్యాన్ సునామీ అని ప్రత్యర్థి పార్టీల మీడియాతో పొగిడించుకున్న ఈసారి.. వై నాట్ 175 అంటూ అన్ని స్థానాలు గెలవాల్సిందేనని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందుకే.. ఇందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూనే వెళ్తున్నారు జగన్. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుంటూ ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. తనలో, తన పార్టీలో చేయాల్సిన మార్పులు, చేర్పులు సైతం చేసుకుంటూనే ముందుకెళ్తున్నారు. ఆఖరికి పదుల సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చేసి.. కొత్త వ్యక్తులను బరిలోకి దింపేశారు కూడా. ఇక సిద్ధం, మేమంతా సిద్ధం పేరిట పక్కా ప్లాన్ ప్రకారం ఏపీ మొత్తం చుట్టేశారు. అబ్బో.. అడగడుగునా ఆ జనం, బహిరంగ సభల్లో జగన్ ప్రసంగం వైసీపీ శ్రేణులకు జోష్.. అదొక కిక్కించే పరిణామం. ఇదిగో ఫలానా నియోజకవర్గం కవర్ చేయలేదు అనేది లేకుండా ఇడుపులాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ తిరిగేశారు జగన్. మొత్తం 2100 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర.. 86 నియోజకవర్గాల్లో పర్యటన.. 16 బహిరంగసభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9చోట్ల భారీ రోడ్‌షోలలో పాల్గొన్నారు. ఒక్కో జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఒక్కోసారి సమావేశం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పోటీచేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ప్రజలకు పరిచయం చేశారు. అసలు జగన్ అనే వాడికి ఎందుకు ఓటేయాలనే విషయాన్ని కూడా క్లియర్ కట్‌గా రాష్ట్ర ప్రజానికానికి వివరించారు. పోనీ.. ఇకనైనా సైలెంట్‌గా ఉందామని అనుకుంటున్నారా అంటే అబ్బే.. అస్సలు కానే కాదు మరో జైత్రయాత్రకు రంగం సిద్ధం చేస్తున్నారు.
తగ్గేదేలే.. నాన్ స్టాప్!
రెండే రెండ్రోజుల్లో మేనిఫెస్టోను రిలీజ్ చేసి.. దాంతో మరోసారి జనాల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. దీనికోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్లు తెలియవచ్చింది. ఈ నెల 27 లేదా 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల సభల్లో పాల్గొనేలా వైసీపీ కార్యాచరణ రూపొందించింది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో.. మరోసారి అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేందుకు.. అది కూడా టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఉన్న నియోజకవర్గాలను సెలక్ట్ చేసుకున్నట్లు తెలిసింది. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌కు వైసీపీ అగ్రనేతలు తుది మెరుగులు దిద్దుతున్నారట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని తెలుస్తోంది. ఈ సభావేదికగా.. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ముఖ్యంగా కుల, మత, వర్గ, జాతి, రాజకీయ బేధాల్లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే జైత్రయాత్ర సాగించబోతున్నారు. అంతేకాదు.. ఎలాగో ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టనున్నారు. ఇక మళ్లీ అధికారమిస్తే ఏమేం చేస్తాననే విషయాలను నిశితంగా ప్రజలకు వివరించబోతున్నారు జగన్. చూశారుగా.. ఈ రేంజ్‌లో రూట్ మ్యాప్, జగన్ వేస్తున్న ఎత్తులు, వ్యూహాలు.. కనీసం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబు, జాతీయ పార్టీ బీజేపీ.. రెండు సార్లు ప్రధానిగా ఉన్న మోదీకి లేవని వైసీపీ శ్రేణులు గర్వంగానే చెప్పుకుంటున్నాయి. ఈ వ్యూహాలన్నీ ఏ మాత్రం ఫలిస్తాయన్నది జూన్-04న తేలిపోనుంది.