వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేయడంతో రెండు కుట్లు వేయించుకున్న సంగతి తెలిసిందే. జగన్ ఎక్కడికెళ్లినా ఇప్పుడు బ్యాండేజీతోనే కనిపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కటే విమర్శలు.. ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హేళన చేస్తూ మాట్లాడిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, తన సోదరి డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి ఒక స్వీట్ సలహా ఇచ్చారు. జగన్ ఇక బ్యాండేజీ తీస్తే బెటర్ అని సూచించారు. ఈమెమీ సెటైర్లు, విమర్శలు గుప్పించలేదండోయ్.. ఒక డాక్టర్‌గా సలహా ఇచ్చారంతే..!
ఇంతకీ ఏం చెప్పినట్లు!
జగన్ బ్యాండ్ తీస్తే బెటరని.. ఎందుకంటే గాలి ఆడితే ఆ గాయం త్వరగా మానిపోతుందని జగన్‌కు సునీత సూచించారు. ఎందుకంటే.. అలా బ్యాండెజీ పెట్టుకుంటే లోపలే ఇంకా చీము పట్టి.. సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నారు. ప్లీజ్.. కొంచెం బ్యాండేజీ తీసేస్తే గాలికి ఆరి, ఎండి త్వరగా మానిపోతుందన్నారు. ముఖ్యమంత్రికి డాక్టర్స్ ఎవరున్నారో తెలియదు కానీ.. తానొక వైద్యురాలిగా చూస్తూ ఉండలేకపోతున్నానని.. బాధగా ఉందని సునీత చెప్పుకొచ్చారు. అది కూడా రిక్వెస్ట్‌గానే సునీత చెప్పడం గమనార్హం. జగన్‌తో పాటు ఎవరికైనా ఇలాగే గాయం అయితే బ్యాండేజీ వాడద్దని కూడా పనిలో పనిగా అందరికీ చెప్పారామె. కాగా.. ఒకానొక సందర్భంలో వైఎస్ జగన్ రెడ్డి దీక్ష చేస్తున్నప్పుడు సునీతనే డాక్టర్‌గా సపర్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
పాపం సునీత..!
తన తండ్రి వివేకా హత్య కేసులో సునీత న్యాయ పోరాటం చేస్తూ నిందితులకు శిక్ష పడేంతవరకూ నిద్రపోనని చెబుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలతో కలిసి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. తండ్రిని చంపిన నిందితులను.. వైసీపీని అస్సలు గెలిపించొద్దని ప్రజలను వేడుకుంటూ వస్తున్నారు సునీత. దీంతో వైసీపీకి బద్ధ శత్రువుగా మారిన సునీత.. అయినా సరే మనసు ఒప్పుకోక వైఎస్ జగన్‌కు అయిన గాయం విషయంలో సలహా ఇచ్చారు. నిజంగా సునీతకు, సునీత మనసుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందేనని కొందరు నెటిజన్లు చెబుతున్న మాట. అయినా సీఎం చుట్టూనే డాక్టర్లు ఉన్నారు.. మీరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదులెండి మేడమ్ అని మరికొందరు సెటైర్లు వేస్తున్న పరిస్థితి. చూశారు కదా.. మంచి చెప్పినా అది ఇప్పటి పరిస్థితుల్లో వైసీపీకి చెడుగానే అర్థమవుతుంది మరి.