సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడిప్పుడే తెలుగులో తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సీతారామం తర్వాత, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో క్యూట్ క్యూట్‌గా నటించి ఫ్యామిలీ అభిమానులను సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్.. తెలుగులో మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెబుతోంది. టాలీవుడ్ అనే కాదు.. ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి కథ వస్తే చేయడానికి రెడీ అనేలా సిగ్నల్ ఇస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన ఆమె.. తాజాగా ఓ సంఘటనను గుర్తు చేసుకుంది.
బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది మృణాల్ ఠాకూర్. తనతో కలిసి నటించిన చిత్రంలోని సన్నివేశాలను ఎప్పటికీ మరిచిపోలేనని మరీ ముఖ్యంగా ఓ సంఘటనని మాత్రం అస్సలు మరిచిపోలేనని చెప్పింది. షాహిద్ కపూర్ హీరోగా, టాలీవుడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ రీమేక్‌లో ఆమె హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో షాహిద్ కపూర్‌ని కొట్టాల్సి వచ్చింది. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. దర్శకుడికి నేను మెల్లిగా నా చేతితో ఇలా అంటాను మీరు ఎడిట్ చేసుకోండి అంటే అతను ఒప్పుకోలేదు. అప్పుడు షాహిద్ కపూర్.. నన్ను పిలిచి.. భయపడవద్దని ధైర్యం చెబుతూ.. నీ మాజీ బాయ్ ఫ్రెండ్ అనుకుని కొట్టు.. అని సలహా ఇచ్చారు. ఆ సన్నివేశాన్ని రెండు కెమెరాల్లో.. మూడు గంటల పాటు చిత్రీకరించారు. ఈ సంఘటన నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అంత బాగా షాహిద్ సపోర్ట్ చేశారని మృణాల్ అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంది.