ఐపీఎల్ ఏంటి.. తమన్నాపై కేసు నమోదవ్వడమేంటి? తమన్నాకు ఐపీఎల్‌తో లింకేంటి? అనే అనుమానాలు వస్తున్నాయి కదా. విషయంలోకి వస్తే.. ఐపీఎల్ చూసినందుకో, ఏమైనా కామెంట్స్ చేసినందుకో తమన్నాపై సైబర్ కేసు నమోదు కాలేదు. ఐపీఎల్‌ని పలానా యాప్‌లో చూడండి అని చెప్పినందుకు తమన్నాపై కేసు నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సెలబ్రిటీలకు.. అందునా బ్యూటీఫుల్ భామలకు సైడ్ ఇన్‌కమ్ అదేనండి.. కమర్షియల్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్నందుకు భారీ అమౌంట్ వస్తుందనే విషయం తెలియంది కాదు. అలా చాలా మంది హీరోయిన్లు, హీరోలు కొన్ని బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలా.. తమన్నా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఓ యాప్.. ఇప్పుడామెకు తలనొప్పులు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ బుల్లితెరపై స్టార్ సంస్థకు.. ఓటిటిలో జియో, వియాకామ్ 18 అనుబంధ సంస్థ జియో సినిమా యాప్‌లకు మాత్రమే ఉండగా.. తమన్నా తను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఓ బెట్టింగ్ యాప్ ఫెయిర్ ప్లేలో కూడా ఐపీఎల్‌ని చూడొచ్చని ప్రమోట్ చేయడంతో ఆమెపై సదరు రైట్స్ ఉన్నవారు కోర్టుకెక్కారు. తమన్నాతో పాటు సంజయ్ దత్ పై కూడా సేమ్ రీజన్‌తో వారు కోర్టుకెళ్లారు. ఏప్రిల్ 29లోపు దీనిపై వివరణ ఇవ్వాలంటూ తమన్నాకు కోర్టు సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ నటించిన బాక్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.