దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంపై గత కొన్నిరోజులుగా పెద్ద రాద్ధాంతమే జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి వచ్చిన వైఎస్ షర్మిల.. ఇప్పుడు తన సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రివర్స్ అయ్యారు. ఒకప్పుడు అన్న వదిలిన బాణం అని చెప్పుకున్న షర్మిల.. ఇప్పుడు అన్నపైనే బాణంలా దూసుకుపోతున్న పరిస్థితి. వైఎస్సార్‌కు అసలు సిసలు వారసురాలిని తానేనని.. జగన్ వైఎస్ ఆశయాలు పాటించలేదని అని విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారు షర్మిల. అయితే ఈ విమర్శలు, ఆరోపణలపై ఇంతవరకూ స్పందించని జగన్.. గురువారం నాడు నామినేషన్ సందర్భంగా గట్టిగా కౌంటర్ ఇచ్చేశారు.
ఎవరు వారసులు..?
పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకూ షర్మిల ఏమేం మాట్లాడారా ఆ మాటలన్నింటికీ స్పందించి కౌంటర్ ఇచ్చేశారు. వైఎస్సార్ వారసులమంటూ కొందరు పసుపు చీరలు కట్టుకుని వస్తున్నారు..? వైఎస్సార్ లెగసీని దెబ్బ తీసినవాళ్లతో చేతులు కలిపిన వీళ్లా వారసులు? అంటూ షర్మిలను జగన్ నిలదీశారు. అంతటితో ఆగలేదు.. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరు..? వైఎస్‌పై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టిందెవరు..? అసలు వైఎస్ పేరును ఛార్జిషీట్‌లో చేర్చిందెవరు..? అంటూ షర్మిలపై జగన్ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
షర్మిల రియాక్షన్ ఏంటో!
వాస్తవానికి.. తన కుమారుడి పెళ్లి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు పసుపు రంగు చీరతోనే వెళ్లారు షర్మిల. దీంతో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ జగన్ ఇలా టార్గెట్ చేస్తూ మాట్లాడటం గమనార్హం. పోనీ.. భారతీ కూడా పలు సందర్భాల్లో పసుపు చీర కట్టుకున్నారు కదా..? మరి దీనిపై ఎలా స్పందిస్తారు జగన్. ఇక ఇదే వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా.. మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా..? ఎంత నీచం! ఇది కదా వికృత మనస్తత్వం?.. అంటూ జగన్‌కు దిమ్మదిరిగేలా కౌంటరిచ్చారు. ఇప్పటి వరకూ ఎన్నికల ప్రచారం సజావుగా సాగించిన వైఎస్ జగన్.. చివరి నిమిషంలో అనవసరంగా షర్మిలను కెలుక్కోవడం అవసరమా..? ఈ పరిస్థితి ఎందకు..? అని సొంత పార్టీ నేతలే జగన్‌పై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఫైనల్‌గా షర్మిల ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.