వర్మ.. ఇప్పుడీ పేరు ఏపీ ఎన్నికల్లో మార్మోగుతోంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం ఆస్థానం సత్యనారాయణ వర్మది గనుక!. గత ఎన్నికల్లో పోటీచేసిన భీమవరం, గాజువాక అసెంబ్లీలను వదిలేసి పిఠాపురం నియోజకవర్గానికి సేనాని రావడంతో వర్మ సీటుకు ఎసరుపడింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు ఇక్కడ అప్రస్తుతం. తొలుత ఆగ్రహావేశాలు అంతకుమించి అలకలు ఇవన్నీ అయిపోయినా ఇప్పుడు అంతా ప్రశాంతమే. పవన్‌ను గెలిపిస్తానని వర్మ.. తన గెలుపు బాధ్యత వర్మదేనని పవన్ ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే.. టీడీపీ క్యాడర్‌లో ఇప్పటికీ వర్మ ఆగ్రహం తగ్గలేదు.. అస్సలంటే అస్సలు కార్యకర్తలు ఏ మాత్రం సపోర్టు చేయట్లేదన్నది పిఠాపురంలో నడుస్తున్న టాక్. దీంతో పవన్‌ను వర్మ గట్టెక్కిస్తారా అనేది డౌటేనట. ఒక్క మాటలో చెప్పాలంటే.. అన్నీ కుదిరితే కింగ్ మేకర్, లేదంటే ట్రబుల్ షూటర్ అవుతారనే చర్చ ఇప్పుడు గట్టిగానే జరుగుతోంది.
మరీ ఇంత నమ్మకమా!
పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి సర్వం వర్మే అన్నట్లుగా పవన్ ఉన్నారు. ఎన్నికల ప్రచారం, గృహప్రవేశం, నామినేషన్.. కార్యకర్తలతో సమావేశం ఇలా అడుగు తీసి అడుగేయాలన్నా పక్కనే వర్మ పక్కనుండాల్సిందే అన్నట్లుగా సేనాని పరిస్థితి ఉంది. ఇక వర్మ.. వర్మ అంటూ జపం చేస్తూనే ఉన్నారు. ఆఖరికి తన సొంత ఇమేజ్, క్రేజ్‌ను కూడా వాడుకోకుండా, నమ్మకుండా వర్మనే నమ్మడంతో జనసేన శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయట. అసలు పవన్ తలుచుకుంటే గెలుపు అనేది పెద్ద కథేమీ కాదన్నది జనసైనికుల వాదనట. పవన్ మాత్రం.. ఇప్పటి వరకూ నాదెండ్ల మనోహర్‌కు ఉన్న స్థానాన్ని వర్మకు ఇచ్చేశారు. నమ్మడంలో తప్పులేదు.. ఏదో అద్భుతం చేస్తారని కూడా ఆశపడొచ్చు ఇందులో ఎలాంటి అనుమానులు అక్కర్లేదు కానీ.. ఎక్కడో తేడా కొడుతోందనే మాత్రం పవన్‌కు క్లియర్‌గా అర్థమవుతోందట. ఎందుకంటే.. వర్మను టీడీపీ కేడర్ అస్సలు లెక్క చేయట్లేదన్నది జగమెరిగిన సత్యమే. టికెట్ తెచ్చుకో లేదా.. ఇండిపెండెంట్‌గా పోటీచేస్తే గెలిపిస్తామన్నది కేడర్ చెబుతున్న మాట. ఇక జనసేనకు కేడర్ అంటారా అంతంత మాత్రమే.. ఉన్న ఆ కాస్త కూడా వర్మ పెత్తనం ఎక్కువవుతోందని సైడ్ అవుతున్న వారు.. పక్క చూపులు చూస్తున్న వారే ఎక్కువట. ఇక బీజేపీకి అస్సలే లేదు.. ఇక ఉన్నదల్లా సామాజిక వర్గమే.!
ఎందుకిలా..?
ఒకవేళ పవన్ గెలిస్తే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్నది వర్మ సందేహమట. ఇన్నాళ్లు మకుటంలేని మహారాజుగా పిఠాపురంను తన గ్రిప్‌లో పెట్టుకున్న వర్మ పరిస్థితేంటని అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారట. ఎందుకంటే.. పవన్ గెలిస్తే కచ్చితంగా మంత్రి అవుతారనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇక తన పరిస్థితేంటన్నది వర్మకు తెలియట్లేదట. కూటమి అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఉండే పదవి ఇస్తామని హామీ వచ్చినప్పటికీ మహా అంటే ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ అంతే కదా ఇక తన భవిష్యత్తు, తన వారసుల భవిష్యత్తేంటనే ఆలోచనలో పడ్డారట. పోనీ రేపొద్దున వేరే నియోజకవర్గానికి వెళ్లి ఈ స్థాయికి ఎదగడం అంటే అయ్యే పనేనా అంటే అదీ కాదు.. ఎందుకంటే ఇండిపెండెంట్‌గానే గెలిపించిన పిఠాపురంను వదలి వెళ్లడమంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదేమో. ఇక పవన్ వెంటే ఉన్నప్పటికీ అంటీ ముట్టనట్లుగానే వర్మ ప్రవర్తన ఉందన్నది స్థానికంగా ఉన్న జనసైనికులు చెబుతున్న మాటలట. అంటే పైకి సపోర్టు.. లోపల మాత్రం వేరేలా సీన్ ఉందని చెప్పకనే చెబుతున్నారన్న మాట. ఇవన్నీ నివేదికలు, కంప్లయింట్లుగా పవన్ దగ్గరికి వెళ్లడంతో ఇదేంటబ్బా.. వర్మ మనసులో ఇంత ఉందా..? అన్నట్లుగా పవన్ కూడా సందేహిస్తున్నారట. అంటే.. పవన్‌కు శత్రువు ఎక్కడో లేరు పక్కనే ఉంటూ పక్కలో బల్లెంలాగానే వర్మ ఉన్నారన్న మాట. ఫైనల్ ఏం జరుగుతుందో.. మున్ముందు ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే మరి.