మేనిఫెస్టో.. ఎన్నికల్లో ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదే గెలుపోటములను నిర్ణయిస్తుంది. హిట్టయితే సూపర్ డూపర్ హిట్టే.. ఆ రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఊహకందదు..! పొరపాటున అలవిగాని హామీలు, నమ్మకంలేనివి మేనిఫెస్టోలో అట్టర్ ప్లాపే..! పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు అనేది వైసీపీకి ఎంత ముఖ్యమో.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ)కి డబుల్ ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ ఎన్నికలు డూ ఆర్ డై అనే చెప్పుకోవచ్చు. అందుకే ఆచితూచి.. ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించి మరీ మేనిఫెస్టో విషయంలో కసరత్తులు చేస్తున్నాయ్ పార్టీలు. అయితే.. వైసీపీ ఎప్పుడు రిలీజ్ చేస్తుందా అని కూటమి.. అబ్బే కూటమి రిలీజ్ చేసిన తర్వాత టార్గెట్ చేసుకుని విడుదల చేద్దామని.. అధికార పార్టీ ఉన్నట్లుగా ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వైసీపీ మేనిఫెస్టో కసరత్తులు పూర్తయ్యాయని ఆ పార్టీల వర్గాలు సమాచారం.
జగనే కావాలన్నట్లుగా!
ఏప్రిల్-25 వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆ మరుసటి రోజే అనగా ఏప్రిల్-26న మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలపై ఇప్పటికే జగన్ ఫుల్ క్లారిటీగా ఉన్నారట. ముఖ్యంగా.. ఆచరణ సాధ్యమయ్యే అంశాలతో మాత్రమే మేనిఫెస్టోను వైసీపీ పెద్దలు రూపకల్పన చేశారని తెలుస్తోంది. అసలు ఫలానా పథకాలు ప్రకటిస్తే జగన్‌కే నా ఓటు అనేలా ప్రజల మనసులో ఓ అభిప్రాయం వచ్చేలా జనాకర్షణ పథకాలు ఉండబోతున్నాయని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో నవరత్నాలుతో ఎలాగైతే అఖండ మెజార్టీతో జగన్ గెలిచారో.. ఇప్పుడు అంతకుమించే పథకాలు ఉంటాయట.
ఇదిగో వీటికే ప్రాధాన్యత!
మేనిఫెస్టోలు మహిళలు, యువత, రైతులే టార్గెట్‌గా పథకాలు ఉన్నాయని తెలిసింది. మహిళా సంక్షేమం కోసం ఏమేం కావాలి..? డ్వాక్రా రుణమాఫీ, చేయూత మహిళల కోసం సెట్ చేసినట్లు సమాచారం. యువతకు జాబ్ క్యాలెండర్.. ఐదేళ్లుగా ఇచ్చిన ఉద్యోగాలకు డబుల్.. నిరుద్యోగ భృతి ఇలానే ఉంటాయట. ఇక ముఖ్యంగా రైతులకు.. రుణమాఫీ, రైతు భరోసా భారీగా పెంపు, రైతు భరోసా కేంద్రాలతో మరిన్ని సేవలు అందుబాటులోకి తేవడం.. ఇలాంటివి ఉంటాయని తెలుస్తోంది. మొత్తమ్మీద ప్రజల అవసరాలే ఎజెండాగా మేనిఫెస్టోఉండబోతోందట. జగన్ మాటిస్తే.. తప్పకుండా ఆరు నూరైనా సరే అమలు చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కల్పించడానికి.. అమలయ్యే హామీలనే ఇవ్వడానికి జగన్ రంగం సిద్ధం చేశారట. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీల్లో మద్యపాన నిషేధం తప్ప 99 శాతం హామీలు అమలు చేశామన్నది వైసీపీ నేతలు చెప్పుకుంటున్న మాటలు. మరి ఈసారి మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది..? దీంతో ఏం జరుగుతుంది..? వైసీపీ హామీల దెబ్బకు కూటమి పరిస్థితేంటన్నది ఒకట్రెండు రోజుల్లో తేలిపోనుంది.