అవును.. సారొచ్చేశారు..! బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు.. కోట్లాది జనం కోరుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ వచ్చేశారు!. తెలంగాణ ఏర్పడక ముందు, ప్రత్యేక రాష్ట్రం వచ్చి, పదేళ్లు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే గులాబీ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ విచ్చేశారు!. ఒక్క మాటలో చెప్పాలంటే.. కేసీఆర్ ఇప్పుడు 2.0 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ అట్టర్ ప్లాప్ అయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు ఎలా మారిపోయాయో తెలియనిదేం కాదు. బీఆర్ఎస్ పని అయిపోయిందని.. కేసీఆర్ ఖతమేనని పదే పదే కాంగ్రెస్, బీజేపీ నేతలు మీడియా గొట్టాల ముందుకొచ్చి చెబుతున్నారు. దీంతో ఇక తగ్గేదేలే అని కేసీఆర్ రంగంలోకి దిగిపోయారు. పొలం బాట అంటూ వర్షాలు లేక పంటలు ఎండిపోయిన రైతుల పక్షాన నిలబడ్డారు.. ఆ తర్వాత భారీ బహిరంగ సభల్లో తనదైన ప్రసంగాలు ఇవ్వడం.. ఏప్రిల్-24 నుంచి బస్సు యాత్ర షురూ చేయడం.. వీటన్నింటికంటే ముందుగా తెలంగాణలోని ఓ లీడింగ్ న్యూస్ ఛానెల్‌కు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం సంచలనంగా మారింది.
ఇదీ అసలు సంగతి!
కేసీఆర్ మీడియా ముందుకొచ్చినా.. బహిరంగ సభలో మాట్లాడినా ఆ పంచ్‌లు, ప్రాస.. వెటకారం, విమర్శలు, కౌంటర్లు, పిట్ట కథలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వాస్తవానికి ఇవన్నీ దూరమై చాలా రోజులే అయ్యాయి. అయితే.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడు అంతకుమించి అన్నట్లుగా ఉందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదేమో. ఈ ఒక్క ఇంటర్వ్యూను యూట్యూబ్‌లోనే అరకోటికిపైగా జనాలు వీక్షించారంటే.. ఇక టీవీల్లో నేరుగా చూసిన జనాలు ఎంత మంది అనేది లెక్కేలేదు. ఎందుకంటే.. కేసీఆర్ ఏం చెబుతారా.. ఘోర పరాజయంపై ఎలా స్పందిస్తారు..? కాంగ్రెస్‌ను ఎలా ఎదుర్కొంటారు..? కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై సార్ రియాక్షన్ ఏంటి..? అని ఇలా అన్ని వర్గాల ప్రజలు వేచి చూస్తూ.. ఇంటర్వ్యూని వీక్షించిన పరిస్థితి. ఈ ఇంటర్వ్యూ చూసిన జనాలందరి నోట కేసీఆర్ ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు అనే మాటే వినిపిస్తోంది.
బాస్ చెప్పిందేంటి..?
ఇంటర్వ్యూ మొత్తం మీద.. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చింది, ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారనే మాటలు వినిపించాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో దేవుళ్లపై ఒట్లు..కేసీఆర్‌పై తిట్లే నడుస్తున్నాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను తగ్గించాలని చాలా ప్రయత్నాలు చేశారని.. అయితే ఆ ప్రయత్నాలు అస్సలు సాగవని తేల్చేశారు. కేసీఆర్ అంటే ఒక ఇన్‌స్టిట్యూషన్ కాదు.. స్టూడెంట్ అస్సలు కాదని.. ఉద్యమం టైమ్‌లో జరిగిన ఆరోపణలు, తిట్టిన తిట్ల ముందు ఇవేం పెద్ద లెక్క కానే కాదని కవరింగ్ చేశారు కేసీఆర్. ఇందిరాగాంధీతో పోల్చుకున్న కేసీఆర్.. ఇందిరమ్మ అంటే ఇండియా అని.. ఇండియా అంటే ఇందిరా అనే అహంకార ధోరణితో ఎమర్జెన్సీ పెట్టి పాలించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు.. జైలు నుంచి పుట్టిన జనతా పార్టీ దేశాన్ని పాలించిందన్నారు.
నేను అస్సలు ఊరుకోను!
కాంగ్రెస్, బీజేపీది రాజకీయ వికృత క్రీడ అని..కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలూ ఇబ్బందులు పడుతున్నాయని తిట్టిపోశారు. నాడు తెలంగాణపై సమైక్య పాలకులు వివక్ష చూపిన విషయాన్ని మరోసారి గులాబీ బాస్ గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఇన్నాళ్లుగా కాళేశ్వరంపై నడుస్తున్న వివాదంపైనా ఈ ఇంటర్వ్యూ వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లే. కాకతీయులు 75 వేల చెరువులు నిర్మించారని.. నిజాం రాజులు కూడా చెరువులను కొనసాగించారన్నారు. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ తాను చేయలేదన్న విషయాన్ని క్లియర్‌గా చెప్పేశారు. తనకు అసలు ఇంజినీరింగ్ భాషే తెలియదని.. తెలంగాణ అవసరాలకు తగ్గట్టు రీ డిజైన్ చేశామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్.. తన కళ్ల ముందే కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేస్తుంటే అస్సలు ఊరుకునేదే లేదని ఒకింత హెచ్చరించారు. ఎవడు అడ్డు వస్తారో రండి.. 50 వేల మంది రైతులను తీసుకొని కాంగ్రెస్ నేతలను తొక్కుకుంటూ పోయే మేడిగడ్డను రిపేర్ చేయిస్తానంటూ పెద్ద సవాలే చేశారు బాస్. పనిలో పనిగా.. కొన్ని మీడియా చానెల్స్‌ను కేసీఆర్ ఏకిపారేశారు. కొన్ని బాకా, కాక చానల్స్ కేసీఆర్ ఉన్నప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితే తాగుబోతులుగా చేస్తున్నారని అన్నారని గుర్తు చేసుకుని మరీ విమర్శించారు. అయితే.. ఇప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితే ఎండ తాపం వల్ల పెరిగాయని రాస్తున్నాయని.. ప్రసారం చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చూశారుగా.. ఇదీ కేసీఆర్ 2.0 స్టోరీ సారాంశం..!