జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవారం పిఠాపురంలో నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీతో రోడ్లన్నీ జలమయమైనట్లుగా.. ఆయన వెనుక కొన్నివేలమంది ర్యాలీగా రావడం జన జాతరని తలపించింది. పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ కార్ మీద నిలబడి ప్రజలకి అభివాదం చేస్తూ నామినేషన్ వెయ్యడానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ చూసిన వారు ఇదంతా విజయోత్సవ ర్యాలీని తలపించింది అనే కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వెంట నామినేషన్ వేసేందుకు టీడీపీ లీడర్ ఎస్వీఎస్ఎన్ వర్మతో పాటు నాగబాబు కూడా వెళ్లారు. నామినేషన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్‌ని కూడా సమర్పించారు. దీని సందర్భంగా తన ఆస్తిపాస్తుల గురించి ప్రస్తావించారు. గత ఐదేళ్ల తాలూకూ ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలను పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో సమర్పించారు. తన పేరు, తన కుటుంబసభ్యుల పేరు మీద 163 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నెల్లూరులో పదో తరగతి పూర్తి చేసినట్లు ఉంది.
పవన్ కళ్యాణ్ గత ఐదేళ్ళలో సుమారుగా 114 కోట్ల రూపాయలు ఆర్జించారు. పవన్ ఆదాయం రూ.114.76 కోట్లు కాగా, అందులో ఐటికి రూ.47.07 కోట్లు చెల్లించారు. జీఎస్టీ రూపంలో పవన్ రూ.26. 84 కోట్లు చెల్లించారు. మొత్తంగా రూ. 73.92 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించినట్లు పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఇక జనసేనాని అప్పుల సంగతికి వస్తే రూ. 64,26 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి రూ.17.56 కోట్లు.. అలాగే ఇతరుల నుంచి రూ.46 కోట్ల 70 లక్షలు అప్పు తీసుకున్నారు. గత ఐదేళ్లలో పవన్ 20 కోట్ల వరకూ విరాళాలు ఇచ్చినట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.