ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో వ్యూహాలు, ప్రతివ్యూహాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు మునిగిపోయాయి!. కూటమి కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్‌ను సీఎం కాకుండా చూడాలన్నది మెయిన్ టార్గెట్. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఏం చేయాలి..? ఈ ఐదేళ్లలో సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. చేసిన మంచి పనులు.. అసలు రెండోసారి ఎందుకు వైసీపీకి ఓటేసి గెలిపించాలి..? ప్రతిపక్షాల వైఫల్యాలు ఏంటి..? అనేది చెప్పుకోవాలి అంతే కదా.. కానీ అబ్బే మాకు అవన్నీ అక్కర్లేదు. కూటమికి ఎవరైనా సపోర్టు చేసినా.. మద్దతిచ్చి మాట్లాడినా వారిని టార్గెట్ చేయడమే వైసీపీ టార్గెట్. అనకాపల్లి నుంచి కూటమి తరఫున పోటీచేస్తున్న సీఎం రమేష్.. రెండుసార్లు మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీర్వాదాలు తీసుకుని మద్దతివ్వాలని కోరారు. చిరు కూడా యాక్సెప్ట్ చేసి.. ఒక వీడియోను రిలీజ్ చేశారు. అంతే.. ఇక చూస్కోండి వైసీపీ మీడియా, సోషల్ మీడియా ఓ రేంజ్‌లో టార్గెట్ చేసింది.
తప్పేంటి బాస్!
చిరు అలాంటోడు.. ఇలాంటోడు..! అసలు హీరోనానా..? తమ్ముడికి మించిన ప్యాకేజీ స్టార్.. మెగా ముసుగు తొలిగింది..! పద్మ విభూషణ్ అవార్డుకు రుణం తీర్చుకుంటున్నాడు..? బాబాయ్ ఇలా ఒకటా రెండా లేక్కలేనన్ని మాటలతో ఒక్కటే రచ్చ. ఇక చిరు గురించి ఎవరైనా కాస్త వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు అయితే నెట్టింట్లో లెక్కలేనన్ని దర్శనమిస్తున్నాయ్. అంతేకాదండోయ్.. ప్రజారాజ్యం సమయంలో చంద్రబాబు గురించి.. పుష్కరాల సమయంలో జరిగిన ఘటన గురించి.. ఇంకా చాలానే చిరంజీవికి సంబంధించిన వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. మరికొందరైతే మెగాస్టార్ ఫొటోను ట్విట్టర్ డీపీగా పెట్టుకొని మరీ విమర్శిస్తుండటం మరీ దారుణం. పోనీ చిరు చేసిందేమైనా తప్పా..? ఆయన లైఫ్ ఆయనిష్టం.. ఎవరికైనా మద్దతిస్తారు.. ఏమైనా చేస్తారు.. మధ్యలో మీకెందుకు మంట.! అనే మాటలు మెగాభిమానుల నుంచి వస్తున్నాయ్. రాజకీయాలకు దూరంగా ఉన్నంత మాత్రాన వాటి గురించి మాట్లాడకూడదు అని రూల్ ఏమైనా ఉందా..? లేదు కదా..?. పోనీ వైసీపీ శ్రేణులకు ఇవన్నీ తెలియక పోవచ్చు.. మరి సలహాదారు సజ్జలకు కూడా తెలియదా ఏంటి..? అనేది వైసీపీ నేతల్లో మెదులుతున్న ప్రశ్న. చూశారుగా.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే చిరంజీవి బాగానే రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది కదూ..!
ఏందయ్యా ఇదంతా!
తమ్ముడికి సపోర్టు ఇచ్చావ్.. ఫండ్ ఇచ్చావ్.. ఆశీర్వదించావ్.. అంతటితో సైలెంట్‌గా ఉండుంటే సరిపోయేది కదా.. ఇక ఇవన్నీ ఎందుకు.. చిరు.! అనేది ఆయన అభిమానులు, శ్రేయోభిలాషుల్లో మనసులోని మాట. అసలు ఎవరీ సీఎం రమేష్.. మీకు ఆయనతో ఏంటి సంబంధం.. పోనీ వచ్చారే అనుకోండి ఒక్క మాట చెప్పి అలాగే అని పంపించి ఉంటే సరిపోయేది కదా.. రెండోసారి ప్రత్యేకించి మరీ వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరమేంటి అందరివాడా..!. ఏదైతేనేం చిరు అనుకున్నదొక్కటి అయినది మరొక్కటి. చిరు మాటలకు పవన్ కల్యాణ్ స్పందిస్తూ అన్నయ్య.. అజాత శత్రువు రా మహాప్రభో అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఏమో గానీ.. చిరు ఇప్పుడు కూటమికి ఫుల్ సపోర్టు ఇస్తున్నాడన్నది క్లియర్ కట్‌గా తెలిసిపోయింది. ఇప్పటి వరకూ ఆశీర్వాదాలు, వీడియోలే ఇచ్చారు కదా.. రేపొద్దున్న ఒక్క ప్రకటన చేసినా, ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఇక వైసీపీ సంగతి అంటారా.. ఇంత రచ్చ చేస్తున్న వైసీపీకి కచ్చితంగా నష్టం జరగక మానదు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. సో.. చిరు దెబ్బకు వైసీకి భారీ మూల్యం చెప్పించక తప్పదన్నది అర్థమవుతుంది.. ఫలితం ఎలా ఉంటుందన్నది జూన్-04న చూద్దాం మరి.