ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం సాగుతోంది కానీ.. ఇంతవరకూ అటు కూటమి గానీ.. ఇటు అధికార వైసీపీగానీ మేనిఫెస్టో ప్రకటించిన పరిస్థితి లేదు. మీరు ముందు ప్రకటిస్తే.. ఆ తర్వాత అది చూసి మేం ప్రకటిస్తామని వైసీపీ, కూటమి పార్టీలు ఒకరిపై ఒకరు పందెం వేసుకుని మరీ కూర్చున్నాయి. ఎందుకంటే.. గెలుపోటములను నిర్ణయించేంది మేనిఫెస్టో కావడంతో ఆచితూచి అడుగులేస్తూ.. ఒకటికి వెయ్యి సార్లు ఆలోచిస్తున్నాయ్ పార్టీలు. సరిగ్గా ఈ సమయంలో వైసీపీ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది.
అతి త్వరలోనే!
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టక ముందే ఒక్కో జాబితా రూపంలో అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మేనిఫెస్టో విషయంలో ఎందుకు వెనకడుగు..? అన్ని విషయాల్లో ముందుండే జగన్ మేనిఫెస్టోలో మాత్రం వెనుకబడ్డారని టాక్ వచ్చేసింది. ఇంతకీ మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది..? నవరత్నాలకు మించి ఏముంటాయ్..? మద్యపాన నిషేధం ఈసారైనా ఉంటుందా లేదా..? కొత్తగా ఏమేం మేనిఫెస్టోలో ఉండబోతున్నాయ్..? కూటమి కుప్పకూలే రీతిలో మేనిఫెస్టోలో ఏముండబోతోంది..? ఇప్పుడిదే రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇదే టైములో జగన్ ఒక స్టెప్ ముందుకేసి మేనిఫెస్టోపై కీలక అప్డేట్ ఇచ్చేశారు. సోమవారం అనగా ఏప్రిల్-22న పార్టీ కీలక, అగ్రనేతలతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటి వరకూ మేనిఫెస్టో ఎంతవరకు వచ్చింది..? ఇంకా ఏమేం యాడ్ చేయాలనే దానిపై నిపుణులు, సీనియర్లతో సలహాలు, సూచనలు జగన్ తీసుకోనున్నారని తెలిసింది.
ఏమేం ఉండొచ్చు..!
ఇప్పుడున్న నవరత్నాలు అలాగే పెట్టి.. కాస్త చిన్నపాటి మార్పులు అవి కూడా నగదు రూపంలో ఇచ్చేవి ఇంకాస్త పెంచడమేనట. ఇక రైతు రుణమాఫీ చేయాల్సిందేనని కొందరు నేతలు.. డ్వాకా రుణమాఫీ కూడా ప్రకటించాలని మరికొందరు జగన్‌ను గట్టిగానే పట్టుబట్టారట. దీంతో ఈ రెండింటినీ మేనిఫెస్టోలో తప్పక యాడ్ చేయాల్సిన పరిస్థితి జగన్‌కు రాబోతోందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈనెల 26 లేదా 27న వైసీపీ మేనిఫెస్టో వచ్చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీఎం జగన్ ఈనెల 25న నామినేషన్ వేయబోతున్నారు.. ముందుగానే మేనిఫెస్టో ప్రకటించి ఆ తర్వాత నామినేషన్‌కు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయంలో కూడా ఉన్నారట. అయితే.. ఎవరూ ఊహించని రీతిలో.. కూటమి కుప్పకూలే రేంజ్‌లోనే మేనిఫెస్టో ఉంటుందని మాత్రం వైసీపీ కార్యకర్తలు గట్టిగానే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.
కూటమికి గట్టి దెబ్బే!
వాస్తవానికి సూపర్ సిక్స్ అని కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ.. పేస్ట్ చేసిన చంద్రబాబు తెగ హడావుడి చేస్తున్నారనే విషయాన్ని జనాల్లోకి గట్టిగానే తీసుకెళ్లింది వైసీపీ. ఇప్పుడు ఇక ఉమ్మడి మేనిఫెస్టోలో కూటమి ఏం చెబుతుందా అనేదానిపై పెద్దగా జనాల్లో ఆసక్తి కూడా లేదు. ఎందుకంటే.. చంద్రబాబు హామీ ఇస్తే.. మేనిఫెస్టోను ఏ మాత్రం అమలు చేస్తారన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నది వైసీపీ చెబుతున్న మాట. అయితే జగన్ విషయంలో మాత్రం 99 శాతం మేనిఫెస్టోను అమలు చేశారని.. భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి అమలు చేశారని వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. మరి జగన్ మేనిఫెస్టోలో ఏముంటుందో.. ఈ ప్రకటన తర్వాత కూటమి ఏం చేస్తుందో.. ఏమేం జరుగుతాయో తెలియాలంటే నాలుగైదు రోజులు వేచి చూడక తప్పదు మరి.