ఆలు లేదు, చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఎన్నికలు జరగలేదు.. కూటమి గెలవలేదు.. కానీ అప్పుడే పదవుల పంపకాల్లో టీడీపీ అభ్యర్థులు. మిగిలిన వారి సంగతేంటి అనేది అటుంచితే.. వైసీపీ నుంచి గెలిచి.. సొంత పార్టీ బల్లెంలా తయారయ్యి నిన్నా మొన్న టీడీపీ కండువా కప్పుకుని ఉండి టికెట్ దక్కించుకుని.. ఆదివారం నాడు బీఫామ్ దక్కించుకున్న రఘురామకృష్ణంరాజును మాత్రం అస్సలు పట్టుకోలేకపోతున్నారు ఏపీ ప్రజలు. నామినేషన్‌కు ముందే గెలిచేశానని.. కూటమి కూడా అధికారంలోకి వచ్చేసిందని పగటి కలలు కంటున్నారు.
ఆపు.. మహాప్రభో!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రఘురామ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేగా తాను కీలక పాత్ర పోషిస్తానని చెప్పారు. ఇంతవరకూ ఓకేగానీ స్పీకర్‌గా కనిపిస్తారా..? లేకుంటే హోం మంత్రిగా కనిపిస్తారా..? అనే ప్రశ్న ఎదురైంది. స్పీకర్‌గానే తన అభిమానులు ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగలేదు.. మంత్రి అవ్వాలన్నది తన లక్ష్యమని చెప్పారు. దీంతో రఘురామకు పక్కాగా హోం మంత్రి పదవి ఇస్తారని పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. వైఎస్ జగన్ సర్కారులో తాను ఇబ్బంది పడటం, చంద్రబాబు సైతం జైలుకెళ్లి రావడం.. టీడీపీ కార్యకర్త మొదలుకుని నేతల వరకూ ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఈ శాఖకు సరైనోడు రఘురామేనని సోషల్ మీడియాలో వీరాభిమానులు, కూటమి కార్యకర్తలు తెగ రాసుకొస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ, నెట్టింట్లో జరుగుతున్న హడావుడిని చూసిన జనాలు.. ఆపండి మహాప్రభో అని సెటైర్లేస్తున్నారు.
అయ్యే పనేనా!
అసలే సొంత నియోజకవర్గాన్ని పోగొట్టుకుని వేరొకరి నియోజకర్గమైన ఉండి నుంచి రఘురామ పోటీచేస్తున్నారు. అసలు మంతెన రామకృష్ణం రాజు ఇప్పటికీ తన అభిప్రాయం చెప్పనే లేదు. సపోర్టు చేస్తానని కానీ.. చేయను అనేది చెప్పలేదు. ఏ క్షణమైనా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాంటిది ఈయన అప్పుడే గెలిచేశానని.. అది కూడా భారీ మెజార్టీతో.. కూటమి గెలిచిందని.. మంత్రి పదవి అని పెద్ద పెద్ద పగటి కలలు కంటుండటం ఆయన విజ్ఞతకే వదిలేయాలి మరి. ఒకవేళ ఈయన కన్న కలలన్నీ నిజమవుతాయేమో జూన్-04న చూద్దాం మరి. అయితే కూటమి గెలిస్తే మాత్రం కచ్చితంగా కీలక పదవే కట్టబెడతారన్నది మాత్రం పక్కా అని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి మరి.