ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం, వ్యూహాలు, అభ్యర్థుల ప్రకటనతో యమా స్పీడు మీదున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా ఆ పార్టీ తరఫున పోటీచేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేశారు. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులకు బీఫామ్‌లు ఇచ్చారు బాబు. పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు, నిర్ణయాలకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని.. పార్టీకి విధేయతతో, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని కూడా అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది.. కానీ ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చడం తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి గురైంది అధిష్టానం
ఎందుకు.. ఏమైంది..?
బీఫామ్‌లు ఇస్తున్నా రండి అని అభ్యర్థులను కరకట్టలోని తన నివాసానికి పిలిపించుకున్న చంద్రబాబు.. ఆఖరి నిమిషంలో ఎవరూ ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చారు. మడకశిర, మాడుగుల, ఉండి, పాడేరు నియోజకవర్గాల అభ్యర్థులను మార్చేశారు. ఈ మార్పుతోనే స్థానిక నేతలు, కార్యకర్తలు రగిలిపోయి బూతులు తిట్టి.. రచ్చ రచ్చజేశారు. ఆఖరికి చంద్రబాబు చిత్రపటాలపై రాళ్లు రువ్వి, బ్యానర్లు, పార్టీ జెండాలను తగులబెట్టేశారు. మరికొన్ని చోట్ల అయితే చంద్రబాబు చిత్రపటానికి చెప్పులతో కొట్టిన పరిస్థితి కూడా. ఎందుకంటే.. మడకశిర అభ్యర్థి సునీల్ ఉండగా.. చివరి నిమిషంలో హ్యాండిచ్చి ఎంఎస్ రాజుకు ఛాన్స్ ఇచ్చారు. ఇదే ఇక్కడ మంటలు రేపింది. ఉండిలోనూ ఇదే పరిస్థితి.. మంతెన రామరాజున పక్కనెట్టి.. రఘురామకృష్ణరాజుకు టికెట్ కేటాయించడం జరిగింది. ఇక్కడైతే పరిస్థితులు ఎలా ఉన్నాయనే అస్సలు చెప్పే పరిస్థితే లేదు. పాడేరులోనూ ఇదే పరిస్థితి. చడీ చప్పుడు లేకుండా గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జెండాలు పీకేసి, ఆఫీసు కార్యాలయానికి తాళాలు వేశారు కార్యకర్తలు.
అటు టికెట్.. ఇటు మార్పు!
టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానని బెదిరించిన సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి మాత్రం ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగుల అసెంబ్లీ స్థానం దక్కింది. అయితే కోట్ల రూపాయిలు ఖర్చుచేసిన ఎన్నారై పైలా ప్రసాద్ పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకమే. ఇక వెంకటగిరిలోనూ ఇదే పరిస్థితి. కోడలిని కాదని మళ్లీ కురుగుండ్ల రామకృష్ణకే అనగా ఆమె మామకే టికెట్ ఇచ్చేసింది హైకమాండ్. అనపర్తి టికెట్ విషయంలో నలిమెల్లి రామకృష్ణారెడ్డి ఎలా మొండికేసి కూర్చున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పిలిపించి చర్చించినా.. ఆఖరికి బీఫామ్‌లకు ముందు మాట్లాడిన అస్సలు వినలేదు. కూటమిలో భాగంగా బీజేపీకి వెళ్లడంతో.. నలిమెల్లిని బీజేపీలోకి పంపి మరీ టికెట్ ఇచ్చేలా సెట్ చేశారు సీబీఎన్. చూశారు కదా.. ఇదీ పరిస్థితి. అటు బీఫామ్‌లు ఇస్తుంటే ఇటు భగ్గుమన్నారు తమ్ముళ్లు. ఇప్పటికే ఐదుగురు టీడీపీ నేతలు రెబల్స్‌గా మారి నామినేషన్లు దాఖలు చేయగా.. తాజా పరిస్థితితో ఎంతమంది రెబల్స్ అవుతారు.. స్వతంత్రులుగా బరిలోకి దిగుతారన్నది వేచి చూడాల్సిందే మరి.