హెడ్డింగ్ చూడగానే కాస్త కన్ఫూజన్‌గా ఉంది కదూ... అవును మీరు వింటున్నది నిజమే. సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై రాయితో దాడి కేసు టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు మెడకు చుట్టుకుంది. దీంతో ఆయన్ను ఏ క్షణమైనా సరే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. అరెస్ట్ అయితే ఇప్పట్లో బయటికి రావడం కష్టమే.. ఎన్నికల ప్రచారం చేయడం కూడా అంతకంటే కష్టమే. దీంతో బోండా అరెస్ట్ అయితే.. వంగవీటి రాధాను బరిలోకి దింపడానికి సెకండ్ ఆప్షన్‌గా టీడీపీ పెట్టుకుందట. ఇప్పటికే రాధాకు అధిష్టానం సమాచారం ఇచ్చినట్లుగా విజయవాడలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఏం జరిగింది..?
జగన్‌పై దాడి కేసులో వేగం పెంచిన పోలీసులు సతీష్ అనే యువకుడు, దుర్గారావు అనే టీడీపీ కార్యకర్తను అదుపులోనికి తీసుకున్నారు. వారిని లోతుగా విచారించగా కర్త, కర్మ.. క్రియ బోండా ఉమానే అని చెప్పినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బోండాను అరెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాలుగైదు బృందాలుగా విడిపోయిన పోలీసులు అటు బోండా ఇంటికి కొందరు.. ఇటు పార్టీ ఆఫీసుకు మరికొందరు శుక్రవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంటి దగ్గరికి పోలీసులు వస్తున్నారని పార్టీ ఆఫీసుకు వచ్చిన ఉమా.. ఇక్కడికి కూడా రావడంతో వెనుక గేటు నుంచి కనిపించకుండా పోయారు.
వంగవీటి రెడీనా!
ఇలా రాత్రంతా హైడ్రామానే నడిచింది. శనివారం ఉదయం మీడియా ముందు ఉమా ప్రతక్షమయ్యారు. నామినేషన్ వేసిన తనను నిత్యం వైసీపీ వేధిస్తూనే ఉందని.. ఎన్నికల కోడ్ వచ్చాక వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. యుద్ధానికి వచ్చినట్లు తన పైకి పోలీసులను ప్రభుత్వం పంపిందని.. అక్రమ కేసులు పెడితే ఎవర్నీ అంత సులువుగా వదిలిపెట్టనని ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ బోండాను అరెస్ట్ చేస్తే మాత్రం.. ప్రస్తుతానికి ఆయన్ను అభ్యర్థిగా తొలగించి వంగవీటి రాధాను సెకండ్ ఆప్షన్‌గా టీడీపీ పెట్టుకుందట. ఇప్పటికే అధిష్టానం నుంచి సమాచారం కూడా రావడంతో నామినేషన్ పత్రాలను రాధా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలియవచ్చింది. అరెస్ట్ అయిన మరుక్షణమే నామినేషన్ పత్రాలు బోండా కుటుంబ సభ్యుల ద్వారా విత్ డ్రా చేసుకుని.. రాధాకు బీఫామ్ ఇవ్వాలని టీడీపీ యోచిస్తోందట.